pradyuman murder: అతనిని బలిపశువును చేశారు.. పేదరికంలో పుట్టడమే అతను చేసిన నేరమా?: విరుచుకుపడిన బాలీవుడ్ నటి

  • ఘటనపై తీవ్రంగా మండిపడిన బాలీవుడ్ నటి రేణుకా సహానే
  • ఇంటర్నేషనల్ స్కూల్స్ లో విద్య ఏ స్థాయిలో ఉందో చూడాలని సూచన
  • మంచి విలువలు నేర్పలేని వారు నాణ్యమైన విద్య ఎలా అందిస్తారు? అంటూ నిలదీత
డబ్బున్న తల్లిదండ్రులు, ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం, గుర్గావ్ పోలీసులపై బాలీవుడ్ నటి రేణుకా సహానే నిప్పులు చెరిగారు. దేశరాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్‌ హత్య కేసులో ఇంటర్ విద్యార్థి నిందితుడని, పేరెంట్స్ మీటింగ్, పరీక్ష వాయిదా వేయించేందుకు హత్య చేసినట్టు తండ్రి ముందే అంగీకరించాడని సీబీఐ అధికారులు ప్రకటించిన అనంతరం ఆమె ఫేస్ బుక్ మాధ్యమంగా స్పందించారు. మానవత్వం ఏమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 కేవలం పరీక్షను వాయిదా వేయించడం కోసం అభం శుభం తెలియని చిన్నారిని దారుణంగా హత్య చేయడం షాక్‌ కు గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. ధనవంతులైన తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, గుర్గావ్ పోలీసులు తమ ఉద్యోగాలను ఎంత హీనంగా చేస్తున్నారో ఈ ఘటన తెలియజేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. అమాయకుడైన వ్యక్తి (బస్సు కండక్టర్ అశోక్ కుమార్) ని బలిపశువును చేశారని ఆమె మండిపడ్డారు. అతడు చేసిన నేరం పేదరికంలో పుట్టడమేనా? అని ఆమె నిలదీశారు.

 అంతర్జాతీయ పాఠశాలలు మేల్కొనాల్సిన సమయం ఇదేనని ఆమె సూచించారు. పరీక్షను వాయిదా వేయించడం కోసం ఓ చిన్నారి గొంతును దారుణంగా కోసి హత్య చేశారు. అంటే ఆ స్కూల్ లో విలువలు ఎంత పతనానికి దిగజారాయో గమనించాలని సూచించారు. మంచి విలువలు లేని వాళ్లు నాణ్యమైన విద్యను అందించగలరా? అని ఆమె ప్రశ్నించారు. కాగా రేణుకా సహానే తెలుగులో 'మనీ మనీ' సినిమాలో నటించింది. 
pradyuman murder
Bollywood
actress
renuka shahane
facebook

More Telugu News