kcr: ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య మృతి.. కేసీఆర్ సంతాపం

  • రాష్ట్రపతి అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న చుక్క స‌త్త‌య్య‌
  • దేశవ్యాప్తంగా ఒగ్గు కథకు పేరు తెచ్చిన జాన‌ప‌ద‌ క‌ళాకారుడు
  • మూఢనమ్మకాలు, చెడు అలవాట్లపై కూడా ఒగ్గు క‌థ‌లు
 జానపద కళారూపం ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తయ్య అనారోగ్యంతో మృతి చెందారు. వరంగల్‌ జిల్లా లింగాల ఘనపురం మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చుక్క స‌త్త‌య్య ఒగ్గు కథ చెప్పడంలో ప్ర‌సిద్ధి చెంది రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు. త‌నదైన శైలిలో ఒగ్గు కథను చెబుతూ సంప్రదాయ వృత్తి కళాకారుల శైలికి భిన్నంగా కొత్త శైలిని రూపొందించారు. దేశవ్యాప్తంగా ఒగ్గు కథకు పేరు తెచ్చారు.

ఆయ‌న క‌ళ‌కు గానూ ఎన్నో జాతీయ అవార్డులు వ‌చ్చాయి. సత్యహరిశ్చంద్ర మహారాజు కథ, సత్యవతి కథ, రామాయణం, మయసభ, కంసవధ వంటి వాటిని ఆయ‌న ఒగ్గుక‌థ రూపంలో చెప్పి అల‌రించేవారు. స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తోన్న‌ మూఢనమ్మకాలు, చెడు అలవాట్లపై కూడా ఆయన ఒగ్గు కథలు చెప్పేవారు. జనగామలో జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేసి పలువురు కళాకారుల‌ను ప్రోత్స‌హించారు. చుక్క సత్తయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి సంతాపం వ్యక్తం చేశారు.  
kcr
sathaiah
oggu katha

More Telugu News