India: లాకప్ డెత్: నిందితుడిని చంపి.. పెట్రోల్‌ పోసి తగలబెట్టిన పోలీసులు!

  • బలవంతపు వసూళ్ల ఆరోపణలతో అనికేత్‌ కోథలే, అమోల్‌ భండారేలను అరెస్టు చేసిన పోలీసులు
  • పోలీసుల చిత్రహింసలు తాళలేక మృతి చెందిన అనికేత్‌  
  • మృతదేహాన్ని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టేసిన పోలీసులు

పోలీస్ స్టేషన్లో నిందితుడిని చిత్రహింసలకు గురిచేసి చంపి, కొండల్లోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టిన ఘటన మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలతో అనికేత్‌ కోథలే, అమోల్‌ భండారే అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజాలు రాబట్టే పేరుతో అనికేత్‌ కోథలేను సంగ్లీ పోలీస్ స్టేషన్ ఎస్సై యువరాజ్‌ కామ్‌ ఠేతో పాటు పోలీసు బృందం చిత్రహింసలకు గురిచేయడంతో అతడు లాకప్‌ లోనే ప్రాణం విడిచాడు.

దీంతో లాకప్‌ డెత్‌ కేసు తమ నెత్తికి చుట్టుకుంటుందన్న భయంతో ఎస్సై యువరాజ్‌, అతని సహచర పోలీసులు అనికేత్‌ మృతదేహాన్ని అదే జిల్లాలోని అంబోలీ కొండల్లోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి తగలబెట్టేశారు. అతనితోపాటు అరెస్టు చేసిన అతని స్నేహితుడు అమోల్‌ ను తీవ్రంగా భయపెట్టి, ప్రాణభయంతో పారిపోయేలా చేశారు. అనంతరం వారిద్దరూ లాకప్ నుంచి తప్పించుకుని పారిపోయారని కట్టుకథలు అల్లారు. దీంతో బాధితులిద్దరి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేశారు.

 ఈ సమయంలో పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉండడంతో ఆందోళన మరింత తీవ్రం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతంగా మారిన పరిస్థితిని చక్కదిద్దేందుకు కొల్హాపూర్‌ రేంజ్‌ స్పెషల్‌ ఇన్‌ స్పెక్టర్‌ విశ్వాస్‌ నాగ్రే పాటిల్‌ రంగప్రవేశం చేశారు. స్వయంగా విచారణ చేపట్టి, పోలీసులే అనికేత్‌ ను చంపి, మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టి ఆధారాలు లేకుండా చేశారని తేల్చారు. అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ యువరాజ్‌ కామ్ ఠే, ఐదుగురు పోలీసు కానిస్టేబుల్స్‌ ను విధుల నుంచి తప్పించారు. 

  • Loading...

More Telugu News