Revanth Reddy: స్పీకర్ రాలేదంటారు... రేవంత్ ఆట మొదలంటాడు... మరి రాజీనామా ఎక్కడాగింది?: అసెంబ్లీ లాబీల్లో ముచ్చట్లు!

  • స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ రాసిన రేవంత్
  • దాన్ని అమరావతిలో చంద్రబాబుకు ఇచ్చిన వైనం
  • తనకింకా రాజీనామా చేరలేదన్న స్పీకర్
  • ఎక్కడ ఆగిందోనని చర్చించుకుంటున్న నేతలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, లాబీల్లో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు, నేతలు కలుసుకున్నా, వారి మధ్య మాటల్లో రేవంత్ రెడ్డి, ఆయన చేసిన రాజీనామా ఏమైందన్న ప్రస్తావన వస్తోంది. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చానని రేవంత్ రెడ్డి ప్రకటించి పది రోజులు దాటింది. తన రాజీనామాను అమరావతిలో చంద్రబాబుకు అందించానని చెబుతూ దాని ప్రతిని రేవంత్ మీడియాకు చూపించారు కూడా. అది స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంది.

ఇక రేవంత్ తన రాజీనామాను ఆమోదించి, ఉప ఎన్నికలకు రావాలని టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు కూడా. అయితే, ఆయన ఇచ్చిన రాజీనామా ఇప్పటికీ అమరావతిలోనే ఉండిపోయింది. తెలుగుదేశం అధిష్ఠానం ఆ లేఖను తెలంగాణ స్పీకర్ కు పంపాలని మరచిపోయినట్టుంది. ఇక ఇదే విషయం అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ల మధ్య చర్చకు వచ్చింది.

"రేవంత్ రాజీనామా ఎక్కడ ఆగింది? ఎక్కడో తట్టుకున్నట్టుంది. స్పీకర్ రాలేదన్నారు. రేవంత్ ఆటమొదలైందన్నాడు. ఇప్పుడు ఎక్కడకు పోయాడు?" అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సంపత్ ను అడిగారు. దీనికి సంపత్ స్పందిస్తూ, అసలు రేవంత్ రాజీనామాను అడిగే దమ్ము మీ పార్టీకి లేదని, మీ పార్టీ దగ్గర విపక్షాలను ఎదుర్కునే ఆయుధాలు కూడా లేవని అన్నారు.

కాగా, చంద్రబాబు తన రాజీనామాను అసెంబ్లీకి పంపకుంటే, తాను స్వయంగా స్పీకర్ ను కలిసి మరో రాజీనామాను ఇస్తానని రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

More Telugu News