Ramdev Baba: రాందేవ్ బాబా గెలుపు వెనక భయంకరమైన చీకటి కోణాలు.. సంచలన విషయాలు బయటపెట్టిన జర్నలిస్ట్ ప్రియాంకా పాఠక్!

  • సంచలనం సృష్టిస్తున్న ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’
  • రాందేవ్ బాబా జీవితంలోని చీకటి కోణాలు బయటపెట్టిన ప్రియాంక
  • పుస్తకంపై నిషేధం కోరుతూ కోర్టును ఆశ్రయించిన రాందేవ్ బాబా
  • పుస్తకంపై స్టే.. న్యాయపోరాటం చేస్తామన్న ప్రచురణ సంస్థ

రాందేవ్ బాబా.. ఇప్పుడీ పేరే సంచలనం. దేశంలోని ఏ మూల ఏ చిన్న కుర్రాడిని అడిగినా బాబా గురించి చెబుతాడు. యోగా గురువుగా జీవితాన్ని ప్రారంభించి నేడు వేల కోట్ల రూపాయల విలువైన ‘పతంజలి’ సంస్థకు అధిపతి. యోగాసనాలు నేర్పే రాందేవ్ ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యారు? ఆయన విజయం వెనక ఉన్నది ఏంటి? ఈ ప్రశ్నలకు జర్నలిస్ట్ ప్రియాంకా పాఠక్ తను రాసిన పుస్తకంలో భయంకరమైన నిజాలను వెల్లడించారు. ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ పుస్తకంలో రాందేవ్ బాబా జీవితంలోని చీకటి కోణాలు వివరించారు. అయితే ఈ పుస్తకం విడుదల కాకుండా రాందేవ్ బాబా ఢిల్లీ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. బాబానే అంతలా కలవరపరిచిన ఆ పుస్తకంలో ఏముందంటే..
 
సాధారణ యోగా గురువుగా జీవితాన్ని ప్రారంభించిన రాందేవ్ బాబా విజయ ప్రస్థాన క్రమంలో ఆయనకు అండగా నిలిచిన ఎంతోమంది స్నేహితులు మాయమయ్యారు. ఆయన జీవితంలో అనుమానాస్పద ఘటనలు లెక్కలేనన్ని. రాందేవ్‌ బాబాను చేరదీసి యోగా నేర్పి దివ్యమందిర్ ట్రస్ట్‌కి కోట్లాది రూపాయల విలువైన భూములిచ్చిన స్వామి శంకర్ దేవ్ 2007లో ఉన్నట్టుండి అదృశ్యమయ్యారు. అప్పుడు విదేశాల్లో ఉన్న బాబా రాందేవ్ విషయం తెలిసీ భారత్‌కు రాలేదు. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ కూడా శంకర్ దేవ్ అదృశ్యానికి గల కారణాన్ని కనిపెట్టలేక చేతులెత్తేసింది.
 
రాందేవ్‌కు అత్యంత సన్నిహితుడైన స్వామి యోగానంద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతుడైన ఆయన ఇచ్చిన లైసెన్స్‌తోనే 1995 నుంచి 2003 వరకు రాందేవ్ ఆయుర్వేద మందులు తయారుచేశారు. ఆ తర్వాత రాందేవ్ ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాదికే యోగానంద్ హత్యకు గురయ్యారు. రాందేవ్ స్వదేశీ మిషన్‌కు ప్రణాళికలు వేసిన మరో స్నేహితుడు రాజీవ్ దీక్షిత్ కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విభేదాల కారణంగా దివ్య మందిర్ ట్రస్ట్‌ డైరెక్టర్ మహారాజ్ కరమ్‌వీర్‌ 2005లో ట్రస్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారంటూ ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ పుస్తకంలో రాశారు. కాగా, ఈ పుస్తకంలో చెప్పినవన్నీ కట్టుకథలేనని రాందేవ్ బాబా శిష్యులు చెబుతున్నారు.
 
 రాందేవ్ బాబా పిటిషన్‌తో పుస్తక ప్రచురణను ఢిల్లీ కోర్టు నిషేధించడంతో ఆ ఆదేశాలపై రచయిత ప్రియాంక పాఠక్, జుగ్గర్‌నాట్ బుక్స్ సంస్థ న్యాయపోరాటానికి దిగాయి. పుస్తకంలో పేర్కొన్న అంశాలు ముమ్మాటికి నిజమని, కోర్టులో తమ వాదన వినిపిస్తామని జుగ్గర్‌నాట్స్ తెలిపింది.
 

More Telugu News