malya: సుప్రీంకోర్టు మాటలనే తిరిగి చెప్పిన లండన్ కోర్టు... క్రికెట్ బుకీని అప్పగించేందుకు ససేమిరా... మాల్యా ఫుల్ కుష్!

  • బుకీనే ఇండియాకు తేలేకపోయిన భారత్
  • జైళ్లలో పరిస్థితులు బాగాలేవన్న లండన్ కోర్టు
  • బుకీ సంజీవ్ ను అప్పగించలేమన్న న్యాయమూర్తి
  • విజయ్ మాల్యా, లలిత్ మోదీల కేసు తీర్పులపై ప్రభావం!

ఇండియాలోని జైళ్లలో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పరిమితికి మించిన ఖైదీలను ఒకే గదిలో కుక్కుతున్నారు. వారికి భద్రత కరవవుతోంది... ఈ మాటలు ఎవరో చెప్పినవి కావు. ఇండియాలోని జైళ్ల స్థితిగతులపై సాక్షాత్తూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు.

ఇక వీటినే ఉటంకిస్తూ, లండన్ లోని ఓ కోర్టు, పదిహేడేళ్లనాటి క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బుకీని ఇండియాకు అప్పగించేందుకు ససేమిరా అన్న నేపథ్యంలో, ఇండియాలో బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, లండన్ లో ఆశ్రయం పొందుతున్న మాల్యా విషయంలోనూ ఇదే జరగవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2000లో దక్షిణాప్రికా ఆటగాడు హ్యాన్సీ క్రోన్జేకు సంబంధమున్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సంజీవ్ కుమార్ చావ్లా అనే బుకీ, లండన్ లో తలదాచుకుని ఉండగా, అతని అప్పగింతపై సుదీర్ఘకాలంగా వాదనలు జరుగుతున్నాయి.

ఇక ఈ కేసులో న్యాయమూర్తి రెబెక్కా తీర్పిస్తూ, "నిందితుడి అప్పగింతను కోరుతున్న దేశంలో, జైలులో అతని రక్షణకు సరైన వ్యవస్థ ఉందని నేను భావించడం లేదు. ఇదే విషయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఈ జైళ్లలో పరిమితికి మించిన ఖైదీలు, నిందితులు ఉండటం ప్రధాన సమస్య. ఇండియా జైళ్లలో మానిటరింగ్ వ్యవస్థ లేదు. కాబట్టి నిందితుడిని అప్పగించలేము" అని చెప్పారు.

ఇక ఈ తీర్పు వెలువడిన తరువాత లండన్ లో తలదాచుకున్న భారత నిందితులు విజయ్ మాల్యా, లలిత్ మోదీ వంటి వారు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బ్రిటన్ లో 12 నేరస్తుల అప్పగింత కేసుల్లో విచారణ జరుగుతోంది. ఈ సంజీవ్ కుమార్ కేసులో తీర్పునే మిగతా కోర్టులూ అనుసరించే అవకాశాలు అధికంగా ఉన్నాయని సమాచారం.

More Telugu News