MS Dhoni: ధోనీకి, నాకు మధ్య నిప్పులు పోయాలని చూశారు: కోహ్లీ

  • మమ్మల్ని విడదీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి
  • ధోనీ ఓ మేధావి.. అతడితో ఆడడం నా అదృష్టం
  • ధోనీ జడ్జిమెంట్ సూపర్

ధోనీకి, తనకు మధ్య నిప్పులు పోయాలని చూసి చాలామంది విఫలమయ్యారని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ టాక్ షోలో పాల్గొన్న ధోనీకి, తనకు మధ్య విభేదాలున్నట్టు వచ్చిన వార్తలపై కోహ్లీ స్పందించాడు. పూర్తిగా మనసు విప్పి మాట్లాడిన కోహ్లీ ఇద్దరి మధ్య ఉన్న కెమెస్ట్రీ గురించి వివరించాడు. లేనిపోనివి కల్పించి తమ మధ్య విభేదాలు సృష్టించి విడదీయాలని చాలామంది చూశారని, అయితే వారి ఎత్తులు పారలేదని కోహ్లీ పేర్కొన్నాడు. అటువంటి రాతలను చూసి తాము నవ్వుకునేవారమని అన్నాడు. ఇద్దరం కలిసి బయటకు వెళ్లినప్పుడు ‘‘వారి మధ్య ఏ గొడవా లేదు’’ అని అందరూ ఆశ్చర్యపోయారని పేర్కొన్నాడు.

ధోనీతో తనది చెరగని బంధమని పేర్కొన్న కోహ్లీ, తాను కెప్టెన్సీ చేపట్టిన తొలినాళ్లలో ధోనీ జట్టులో ఉండడం తన అదృష్టమని అన్నాడు. మైదానంలో ధోనీ సీరియస్‌గా కనిపించినా జోకులు వేసినప్పుడు చక్కగా నవ్వుతాడని కోహ్లీ చెప్పాడు. అతడి నుంచి తాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని అన్నాడు. ధోనీ జడ్జిమెంట్‌కు తిరుగుండదని కితాబిచ్చాడు. ధోనీ రెండో పరుగుకు పిలిచాడంటే మరో మాట చెప్పకుండా కళ్లు మూసుకుని పరుగు తీస్తానని, అతడి జడ్జిమెంట్‌పై అంత నమ్మకమని చెప్పాడు.

‘‘అండర్-17 రోజుల్లో నేను ప్రాతినిధ్యం వహించే అకాడమీ తరపున మ్యాచ్‌కు కొత్త కుర్రాడు ఒకడు వచ్చాడు. నేను బంతిని అతని వైపు విసిరి ‘కహాసే’ ('ఏ పక్క నుంచి బంతి వేస్తావు?' అన్న అర్థంలో) అని అడిగా. అతను దానిని ఏ ఊరు నుంచి వచ్చావు? అని అడిగాననుకుని, ‘భయ్యా నజఫ్‌గఢ్ సే’ (నజఫ్‌గఢ్ నుంచి వచ్చాను) అని చెప్పాడు. ఆ తర్వాత ఓ మ్యాచ్ మధ్యలో ఈ ఫన్నీ విషయాన్ని ధోనీకి చెబితే విరగబడి నవ్వాడు’’ అని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తనకు మంచి క్రికెట్ బ్రెయిన్ ఉందని తానైతే అనుకోవడం లేదని చెప్పాడు. ధోనీలాంటి మేధావిని తన కెరీర్లోనే చూడలేదన్న కోహ్లీ, పదిసార్లు అతడి నుంచి సలహాలు తీసుకుంటే ఎనిమిదిసార్లు అది పనిచేస్తుందని కోహ్లీ వివరించాడు.

More Telugu News