malkagiri: ఫేస్‌బుక్‌లో అమ్మాయిని వేధించిన మల్కాజ్‌గిరి కార్పొరేటర్ కుమారుడు.. అరెస్ట్‌!

  • ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ అరెస్ట్ అయిన జగదీశ్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్
  • బుద్ధి మార్చుకోని యువ‌కుడు
  • మ‌రో యువ‌తిని వేధింపుల‌కు గురిచేసిన వైనం
  • నాగోలు వ‌ద్ద నిందితుడిని ప‌ట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ జగదీశ్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్ (20) ఈ ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియా ద్వారా ఓ యువ‌తిని వేధించిన కేసులో అప్ప‌ట్లో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, బెయిల్‌పై విడుద‌లైన అభిషేక్ గౌడ్ త‌న బుద్ధిని మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శించాడు. గత నెల 17న న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఓ యువతికి ఫ్రెండ్‌ రెక్వెస్ట్ పంపాడు. ముక్కుమొహం తెలియ‌ని ఆ యువ‌కుడి ఫేస్‌బుక్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసిన‌ ఆ యువ‌తి అనంత‌రం అత‌డి నుంచి వేధింపుల‌కు గురైంది.

ప్ర‌తిరోజు ఆమెతో చాటింగ్ చేస్తోన్న అభిషేక్ గౌడ్ ఆమె నగ్నచిత్రాలు పంపించాలని కోరాడు. అయితే, ఆ యువతి అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమె ప్రొఫైల్‌ పిక్‌లో ఉన్న ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశాడు. తనతో చాటింగ్‌ చేయకపోతే దాన్ని సోష‌ల్ మీడియాలో పెట్టేస్తాన‌ని బెదిరించాడు. ఆ యువ‌తి రాచ‌కొండ పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో.. అభిషేక్‌ నాగోలు ఎక్స్‌ రోడ్డు వద్ద ఉండ‌గా అరెస్టు చేశారు.

అయితే, త‌న ఫోన్‌లో ఎటువంటి ఆధారా‌లు దొరక‌కూడ‌ద‌నే ఉద్దేశంతో అభిషేక్ తన ఫోన్‌ను ధ్వంసం చేశాడు. అయిన‌ప్ప‌టికీ, పోలీసులు టెక్నాలజీ సాయంతో ఆ ఫోన్‌లోని డేటాని సేకరించారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.   

More Telugu News