maharashtra: కలెక్టర్ బాగోతాలను పసిగట్టి బ్లాక్ మెయిల్ చేసిన డిటెక్టివ్ దంపతులు... కటకటాల వెనక్కి పంపిన పోలీసులు!

  • రాసలీలలు, రహస్య సంభాషణలు సేకరించిన డిటెక్టివ్
  • భార్యతో కలసి బెదిరింపులు
  • వలపన్ని దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు

మహారాష్ట్రకు చెందిన ఓ ఐఏఎస్ అధికారిని వెంబడించి, అతని రహస్యాలను కనుక్కొని, వాటి సాక్ష్యాలను సేకరించి రూ. 7 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసిన డిటెక్టివ్ దంపతులను పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఐఏఎస్ అధికారిగా, మహారాష్ట్ర రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా ఉండి, గడచిన ఆగస్టులో సస్పెన్షన్ కు గురైన రాధేశ్యామ్ మోపాల్వర్ కు సంబంధించిన కొన్ని రహస్యాలను ప్రైవేట్ డిటెక్టివ్ సతీశ్ మాంగ్లే పసిగట్టాడు.

తన భార్యతో కలసి రాధేశ్యామ్ రాసలీలలను, ఫోన్ కాల్ రికార్డింగ్స్ సంపాదించాడు. ఆపై తనకు 7 కోట్లు ఇవ్వాలని లేకుంటే,  వాటిని బయటపెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో రాధేశ్యామ్, థానే పోలీసులను ఆశ్రయించగా, వారు వల పన్నారు. డబ్బు సిద్ధం చేస్తున్నామని రాధేశ్యామ్ తో చెప్పించారు.

ఓ కానిస్టేబుల్ కు రూ. కోటి ఇచ్చి పంపారు. అతన్ని తమ ఇంటికే సతీష్ ఆహ్వానించాడు. దాంబివాలీలోని ఇంట్లో సతీష్ ను, ఆయన భార్య శారదలను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు ల్యాప్ టాప్ లు, ఐదు మొబైల్ హ్యాండ్ సెట్లు, నాలుగు పెన్ డ్రైవ్ లు, 15 సీడీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఎంతో మంది ఫోన్ రికార్డింగ్స్, వారి వ్యక్తిగత ఫోటోలు ఉన్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News