jin ping: యుద్ధానికి సిద్ధంగా ఉండండి... గెలిచి చూపండి: పీపుల్స్ ఆర్మీకి జిన్ పింగ్ ఆదేశాలు

  • సీఎంసీ విన్యాసాలు తిలకించిన జిన్ పింగ్
  • గెలుపును అలవాటు చేసుకోండి
  • సైన్యానికి జిన్ పింగ్ పిలుపు

తన సైన్యం ఏ క్షణమైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని, యుద్ధంలో గెలిచి చూపాలని చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ పీపుల్స్ ఆర్మీకి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు చైనా సాయుధ దళాలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించినట్టు చైనా అధికారిక మీడియా ప్రకటించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కేంద్ర కమిటీకి జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు చైర్మన్ గా ఉన్న ఆయన, కమాండర్ - ఇన్ - చీఫ్ హోదాలో సీఎంసీ నిర్వహించిన విన్యాసాలు తిలకించిన తరువాత సైన్యాన్ని ఉద్దేశంచి ప్రసంగించారు.

"యుద్ధానికి సిద్ధంగా ఉండటంతో పాటు సీఎంసీ గెలుపును అలవాటు చేసుకోవాలి. చేపట్టిన మిషన్ ఎంత పెద్దదైనా వెనుకంజ వేయరాదు. మీ గెలుపుతో కొత్త శకానికి నాంది పడుతుంది" అని జిన్ పింగ్ వ్యాఖ్యానించినట్టు 'క్నిన్హువా' న్యూస్ ఏజన్సీ వ్యాఖ్యానించింది. కాగా, చైనాకు 28 లక్షల మంది సైనికులు ఉండగా, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్మీ చైనాదే కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని జిన్ పింగ్ వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. గత నెల 24వ తేదీన బీజింగ్ లోనూ జిన్ పింగ్ ఇవే వ్యాఖ్యలు చేశారు.

దేశ భద్రతలో ఆర్మీదే కీలక పాత్రని గుర్తు చేసిన ఆయన, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని, అధునాతన ఆయుధాలకు, మౌలిక వసతులకు లోటు రానివ్వబోమని అన్నారు. 64 సంవత్సరాల జిన్ పింగ్ గత నెల 26న రెండోసారి చైనా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సైనిక ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, మరిన్ని అత్యాధునిక ఆయుధాల కోసం తీసుకునే చర్యలకు తాను పూర్తి మద్దతు ఇస్తానని తెలిపారు.

More Telugu News