rains: దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు.. జల దిగ్బంధం!

  • భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం
  • ఐదు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు
  • నీట మునిగిన వందలాది ఇళ్లు.. దేవాలయాల్లోకి చేరిన నీరు
  • రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్

బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుండగా, కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు పట్టణాలు జల దిగ్బంధంతో అల్లాడుతున్నాయి. చెన్నై మహానగరం చెరువును తలపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా పడుతున్న వర్షాలకు నాగపట్టణం అస్తవ్యస్తమైంది.

వందలాది ఇళ్లు నీళ్లల్లో మునిగిపోయాయి. విలక్కుముక్కుతేరు, థేరెక్కువేలి, వైదీశ్వరన్‌ దేవాలయాల్లోకి వరద నీరు చేరుకుంది. సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. బాధితులను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నామని ముంపు ప్రాంతాలను సందర్శించిన పళనిస్వామి వెల్లడించారు.

పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరడంతో ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. రాజీవ్ రహదారిపై నాలుగు అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోంది. చెన్నై నగరంలోని సబ్ వేలన్నీ నీటిలో మునిగిపోయాయి. చాలా బస్సులు రోడ్లపైనే మొరాయించాయి. ఇక తమిళనాడులో 40 శాతం మంది ప్రజలు గత రెండు రోజులుగా చిమ్మ చీకట్లోనే మగ్గుతున్నారు.

2015 తరువాత గురువారం నాడు అత్యధిక వర్షపాతం నమోదు కావడం, ఆపై శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకూ వర్షం కొనసాగడంతో ఇబ్బందులు అధికంగా ఉన్నాయని, సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక గత 48 గంటల్లో చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను ప్రభావం దిగువ కోస్తా వరకు మాత్రమే ఉండటంతో, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనూ వర్షపాతం నమోదుకాలేదు. ఆకాశం నిర్మలంగా ఉండటంతో రాత్రిపూట తాజా కనిష్ఠాలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. నిజామాబాద్, రామగుండం ప్రాంతాల్లో 17.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత తగ్గింది.

  • Loading...

More Telugu News