female child: ఆడ‌పిల్లను క‌నండి... బంగారు నాణెం గెలవండి: కేరళ కౌన్సిలర్ ఆఫర్!

  • కేర‌ళ‌లోని కొట్టాక్క‌ళ్ మున్సిప‌ల్ కౌన్సిల్ వినూత్న ఆలోచ‌న‌
  • లింగ నిష్ప‌త్తిని కాపాడేందుకు ప్ర‌య‌త్నం
  • రెండేళ్లుగా బంగారు నాణేలు అంద‌జేస్తున్న కౌన్సిల‌ర్‌

కేర‌ళ‌లో లింగ‌నిష్ప‌త్తిలో మొద‌టిస్థానంలో ఉన్న‌ప్ప‌టికీ ఆడ‌పిల్ల‌లకు జ‌న్మ‌నివ్వ‌డాన్ని ప్రోత్స‌హిస్తూ.. ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడో మున్సిప‌ల్ కౌన్సిల‌ర్‌. అందుకోసం ఆడపిల్లను క‌న్నవారికి బహుమతిగా ఓ బంగారు నాణేన్ని ఇస్తున్నారు. అబ్దుల్‌ రహీమ్‌.. మలప్పురం జిల్లా కొట్టాక్కళ్ మున్సిపల్‌ కౌన్సిల‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. అక్క‌డి బాలికల నిష్పత్తిని కాపాడేందుకు ఆయ‌న రెండేళ్లుగా త‌న వార్డులో ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లులకు ఒక గ్రాము విలువ చేసే బంగారు నాణేన్ని బహూకరిస్తున్నారు. అలా ఇప్ప‌టివ‌ర‌కు 16 మంది త‌ల్లుల‌కు బంగారు నాణేలు అంద‌జేశారు.

‘చాలా మంది పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ‌ హత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలు లేకుండా ఒక్కసారి ప్రపంచాన్ని వూహించుకోండి, ఎలా ఉంటుంది? అన్ని మత గ్రంథాల్లో ఆడపిల్లకు ప్రథమ స్థానం ఉంటుంది. కానీ, నిజ జీవితంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మార్పు రావాలి. అందుకే నా ఈ ప్ర‌య‌త్నం` అని రహీమ్‌ చెప్పుకొచ్చారు.

ఆయన చేస్తున్న సేవను చూసిన కొందరు బంగారువర్తకులు తాము కూడా సహాయం చేస్తామని ముందుకు వచ్చిన‌ప్ప‌టికీ రహీమ్ వారి స‌హాయాన్ని తీసుకోలేదు. ప్ర‌చారం కోసం తాను ఈ ప‌ని చేయ‌డం లేదంటూ ఆయన వారి స‌హాయాన్ని నిరాకరించారు.

More Telugu News