kashmir: కాశ్మీర్ లో తిష్ఠ వేసిన ఉగ్రవాదుల సంఖ్యపై సైన్యం ప్రకటన!

  • మొత్తం 115 మంది ఉగ్రవాదులు ఉన్నారు
  • 99 మంది స్థానికులు, 15 మంది విదేశీయులు
  • ప్రకటించిన విక్టరీ ఫోర్స్ టీమ్ హెడ్ బీఎస్ రాజు

దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో మొత్తం 115 మంది ఉగ్రవాదులు తిష్ఠవేసుకుని ఉన్నారని మేజర్ జనరల్ బీఎస్ రాజు ప్రకటించారు. వీరిలో 99 మంది ఉగ్రవాదులు స్థానికులు కాగా, 15 మంది విదేశీ ఉగ్రవాదులని వెల్లడించిన ఆయన, వీరు ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్టు పేర్కొన్నారు.

విక్టర్ ఫోర్స్ టీమ్ కు అధిపతిగా ఉన్న బీఎస్ రాజు, పుల్వామాలో మీడియాతో మాట్లాడుతూ, గడచిన ఆరు నెలల వ్యవధిలో సైన్యం దాడులు చేసి 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని అన్నారు. ఇద్దరు సెక్యూరిటీ జవాన్లు, ఓ ఉగ్రవాది గత రాత్రి సాంబోరా గ్రామంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారని చెప్పిన ఆయన, మరణించిన ఉగ్రవాది జైషే మొహమ్మద్ కు చెందిన బాదర్ గా గుర్తించామని అన్నారు.

50 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారని తెలిపారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కి ఉన్నారన్న సమాచారం వచ్చినా, ఆ వెంటనే స్పందించి దాడులు జరుపుతున్నామని తెలిపారు. కాశ్మీర్ లో యువత ఉగ్రవాదానికి దూరంగా ఉండాలని, ఈ దిశగా వారికి చిన్నతనం నుంచే సన్మార్గం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బోధించాలని బీఎస్ రాజు సూచించారు.

More Telugu News