aadhaar: మేఘాల‌యా ముఖ్య‌మంత్రికి ఆధార్ కార్డ్ లేద‌ట‌... ఇంకా న‌మోదు కూడా చేసుకోలేద‌ట‌!

  • వెల్ల‌డించిన మేఘాల‌యా ముఖ్య‌మంత్రి ముకుల్ సంగ్మా
  • వ్య‌క్తిగ‌త ఏకాంతానికి భంగమంటూ వ్యాఖ్య‌
  • త‌మ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ ఏకాంతానికి కూడా భంగం క‌ల‌గ‌కుండా చూస్తాన‌న్న సీఎం

ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త ఏకాంతానికి భంగం క‌లిగించే ఆధార్‌కి ఇంకా తాను న‌మోదు చేసుకోలేద‌ని మేఘాల‌యా ముఖ్య‌మంత్రి ముకుల్ సంగ్మా తెలిపారు. 'నేను ఇంకా ఆధార్ కోసం న‌మోదు చేసుకోలేదు. నా ప్ర‌జ‌ల ఏకాంతం గురించి కూడా నేను ఆలోచిస్తాను. ప్ర‌జాస్వామ్యంలో వ్య‌క్తిగ‌త ఏకాంతం అనేది చాలా ముఖ్యం. అలా లేన‌పుడు ప్ర‌జాస్వామ్యానికి అర్థం లేదు' అని ఆయ‌న అన్నారు. అసోం ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్‌తో క‌లిసి ప్ర‌భుత్వానికి ఓ లేఖ రాసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. తామిద్ద‌రూ స‌రైన దారిలోనే వెళ్తున్నామ‌ని, ఆధార్ విష‌యంలో త‌మ నిర్ణ‌యం ఎప్ప‌టికీ మార‌ద‌ని ముకుల్ సంగ్మా తెలిపారు.

'ఆధార్ విష‌యంలో దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల ప‌రిస్థితి విభిన్నం. అక్ర‌మ చొర‌బాట్లు, దేశ స‌రిహ‌ద్దులో ఉండ‌టం కార‌ణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వ్య‌క్తిగ‌త ఏకాంతానికి పెద్ద‌పీట వేయాల్సిన అవ‌స‌రం ఉంది' అని ముకుల్ సంగ్మా అన్నారు. గ‌తంలో ఈశాన్య రాష్ట్రాల‌కు ఆధార్ నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ ఈ ఇద్ద‌రూ ముఖ్య‌మంత్రులు ప్ర‌ధానికి లేఖ రాశారు.

More Telugu News