laden: లాడెన్ గురించి మరిన్ని ఆసక్తికర నిజాలివి... సీక్రెట్ డాక్యుమెంట్స్ విడుదల చేసిన సీఐఏ!

  • అమెరికాకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన లాడెన్
  • అబోటాబాద్ లో మట్టుబెట్టిన యూఎస్ మెరైన్స్
  • తాజాగా లక్షకు పైగా దస్త్రాలు విడుదల
  • లాడెన్ సినిమాలు అధికంగా చూస్తాడట
  • పదుల కొద్దీ చిన్న పిల్లల సినిమాల కలెక్షన్

అగ్రరాజ్యం అమెరికాపై అతిపెద్ద దాడిని జరిపి, ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చి, ఆపై అమెరికా దాడిలోనే మరణించిన బిన్ లాడెన్ గురించిన మరిన్ని దస్త్రాలను సీఐఏ విడుదల చేసింది. పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో దాక్కున్న అతన్ని అమెరికన్ సైన్యం మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు ఆయన నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు, మూవీ కలెక్షన్ గురించిన సమాచారం తాజా డాక్యుమెంట్లలో ఉంది.

లాడెన్ ఇంట్లో ఓ డీవీడీ ప్లేయర్ తో పాటు "వేర్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఒసామా బిన్ లాడెన్?" డాక్యుమెంటరీ వీడియో ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ 11 దాడులకు సూత్రధారైన లాడెన్ వద్ద డజన్ల కొద్దీ సినిమా సీడీలు ఉన్నాయని, వాటిల్లో పిల్లలు అధికంగా ఇష్టపడే సినిమాలు ఎన్నో ఉన్నాయని తెలిసింది.

'యాంట్జ్', 'చికెన్ లిటిల్', 'కార్స్' వంటి సినిమాలున్నాయి. వీటితో పాటు బీబీసీ, నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలైన 'వరల్డ్స్ వరస్ట్ వెనమ్', 'ఇన్ సైడ్ ది గ్రీన్ బీరెట్స్', 'కుంగ్ ఫూ కిల్లర్స్' ఉన్నాయి. మొత్తం లక్షకు పైగా పేపర్స్ ను సీఐఏ విడుదల చేసింది. 2010కి ముందు లాడెన్ రాసిన ఓ లేఖలో అమెరికాతో పోలిస్తే మన బలం తక్కువే అయినా, చరిత్ర మొత్తం గుర్తు పెట్టుకునే దెబ్బ కొట్టేందుకు సరిపోతుందని లాడెన్ అభిప్రాయపడ్డాడు.

అమెరికాపై దాడుల తరువాత అమెరికాకు భయపడిన లాడెన్, 38 వేల చదరపు అడుగుల కాంపౌండ్ లో ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్ లేకుండా గడిపాడని ఈ సందర్భంగా సీఐఏ పేర్కొంది. ఇప్పటికీ ఉగ్రవాదులు, ఉగ్రవాద సంఘాల్లో లాడెన్ పేరు వినిపిస్తూనే ఉందని, లాడెన్ ను కొలుస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని సీఐఏ అధికారి ఒకరు వెల్లడించారు.

  • Loading...

More Telugu News