raghuveera reddy: యుద్ధ భూమి నుంచి జగన్ పారిపోతున్నారు.. ఈయనకు ఓటు ఎందుకు వేయాలి?: రఘువీరా

  • అసెంబ్లీకి వెళ్లననడం దారుణం
  • తమ సమస్యలను చర్చించేందుకే జగన్ ను ప్రజలు ప్రతిపక్ష నేతను చేశారు
  • జగన్ పాదయాత్రకు ప్రజామోదం ఉండదు

వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, పాదయాత్రకు వెళతానని జగన్ అంటున్నారని... ఇది ముమ్మాటికీ యుద్ధభూమి నుంచి పారిపోవడమేనని ఎద్దేవా చేశారు.

 తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కరించడానికే జగన్ కు ప్రతిపక్ష నేత పదవిని ప్రజలు కట్టబెట్టారని చెప్పారు. ఎవరైనా ఏదైనా సమస్యను జగన్ వద్ద ప్రస్తావిస్తే... 'నన్ను సీఎంను చేయండి' అనే సమాధానం ఇస్తారని విమర్శించారు. 'నన్ను ముఖ్యమంత్రిని చేయండి... అప్పుడు మీ సమస్యలు పరిష్కరిస్తా' అని చెప్పే నాయకుడు దేశంలో జగన్ ఒక్కరే అని ఎద్దేవా చేశారు.

ఓ వైపు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని... ఇటువంటి పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వెళ్లనంటున్నారని... ఇలాంటి వారికి ప్రజలు ఓటు ఎందుకు వేయాలని రఘువీరా ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు ప్రజలు రావచ్చేమో కానీ... ఆ పాదయాత్రకు ప్రజామోదం ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని... ఆయన బయటి వ్యక్తి కాదని, తమ నేత జైపాల్ రెడ్డికి అల్లుడేనని చెప్పారు. 

More Telugu News