srisailam: వామ్మో.. జల'మాయం'... శ్రీశైలం నుంచి 100 టీఎంసీల నీరు మాయం!

  • లెక్కలు తేలడం లేదంటున్న కృష్ణా బోర్డు
  • మాయమైన నీరు ఎక్కడ?
  • ప్రత్యేక అధ్యయనం చేయించనున్న బోర్డు

ఒకటి, రెండు కాదు... ఏకంగా 100 టీఎంసీల నీరు. శ్రీశైలం జలాశయంలోకి వచ్చినట్టు రికార్డయింది, కిందకు వదిలినట్టూ రాసుంది. కానీ, ఆ నీరు నాగార్జున సాగర్ కు మాత్రం చేరలేదు. ఈ విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు గుర్తించింది. ఇక మొత్తం 100 టీఎంసీల నీరు లెక్కలో తేలడం లేదని నిర్ణయించిన బోర్డు, మరో మూడు రోజుల్లో, 4న జరిగే బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించుకుంది. పోతిరెడ్డి పాడు నుంచి అధికంగా నీరు తీసుకెళ్లి, ఆ నీటిని విడుదల చేసినట్టు ఏపీ అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని తెలంగాణ ఆరోపించింది,

ఇక శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా అక్టోబర్ 20 వరకూ 197 టీఎంసీల నీటిని సాగర్ కు విడుదల చేయగా, సాగర్ కు 155 టీఎంసీలే చేరాయి. అంటే 44 టీఎంసీలకు పైగా నీరు మాయం అయినట్టే. ఇక అక్టోబర్ 12 నుంచి 19 వరకూ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ద్వారా 76 టీఎంసీల నీటిని వదిలినట్టు రికార్డుల్లో ఉంది. ఈ లెక్కల్లో మాయ చేశారని తెలంగాణ చెబుతోంది.

తొమ్మిది రోజుల్లో 35 టీఎంసీలను పోతిరెడ్డి పాడు నుంచి తీసుకెళ్లారని ఫిర్యాదు చేస్తోంది. ఇక జూరాలకు వస్తున్న నీటి నుంచి కొంత భాగాన్ని తెలంగాణ అక్రమంగా తీసుకుంటోందని ఏపీ ఆరోపిస్తోంది. అక్టోబర్ 20 వరకూ జూరాలకు 426 టీఎంసీలు రాగా, 63 టీఎంసీల నీరు మాయమైందని, 362 టీఎంసీలు వచ్చినట్టుగానే చెబుతోందని ఆరోపించింది. ఈ మొత్తం వ్యవహారంపై అవసరమైతే ప్రత్యేక అధ్యయనం చేయించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News