job: కంపెనీ కోసం బాగా ప‌నిచేస్తున్నాడ‌ని ఉద్యోగం నుంచి తీసేసిన వైనం!

  •  బార్సిలోనాలోని ప్రముఖ సూపర్ మార్కెట్‌ సంస్థ ‘లిడిల్‌’‌లో వింత‌ చర్య 
  • ఎక్కువ సేపు ప‌నిచేయ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని తెలిపిన కంపెనీ
  • ఎంప్లాయ్‌మెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన ఉద్యోగి

ఉద్యోగి బాగా ప‌నిచేస్తే ఏ సంస్థ అయినా ఏం చేస్తుంది? ఎంప్లాయి ఆఫ్ ది ఇయ‌ర్, ఎంప్లాయి ఆఫ్ ది మంత్ అంటూ బ‌హుమ‌తులు ఇచ్చి మెచ్చుకుంటుంది. అటువంటి వారికి త్వ‌ర‌గా వేత‌నాలు పెంచేస్తుంది. అటువంటి ఉద్యోగుల‌ను ఎప్ప‌టికీ వ‌దులుకోబోదు. కానీ, హార్డ్ వ‌ర్క్ చేసినందుకు గానూ ఓ వ్య‌క్తి త‌న ఉద్యోగాన్ని కోల్పోయిన ఘ‌ట‌న స్పెయిన్‌ బార్సిలోనాలోని ప్రముఖ సూపర్ మార్కెట్‌ సంస్థ ‘లిడిల్‌’‌లో చోటు చేసుకుంది.

దానిలో మేనేజ‌ర్‌గా ప‌నిచేసే జీన్ పి అనే వ్య‌క్తి ప్రతిరోజూ ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ఉదయాన్నే ఐదు గంట‌ల‌కే సూప‌ర్ మార్కెట్‌కి వచ్చేవాడు. అందులో ప‌నిచేసే సిబ్బంది వచ్చేలోపు స్టోర్‌లోని సామగ్రిని అంతటినీ ప‌రిశీలించి అవి స‌రిగ్గా ఉన్నాయో లేవో చూసుకునేవాడు. ఇదే ఆయ‌న పాలిట శాపంగా మారింది. ఉద్యోగులు రావాల్సిన‌ సమయం కంటే త్వ‌ర‌గా వ‌చ్చేయ‌డం, స్టోర్‌లో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధిక సమయం ఉండ‌డం, ఒక్క‌డే ఒంట‌రిగా ఉండ‌డం వంటివి చేయ‌కూడ‌దని ఆ కంపెనీ తెలుపుతూ ఉద్యోగంలో నుంచి తీసేసింది.

తాను ఆ కంపెనీలో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాననీ ఉన్న‌ట్లుండి తీసేశార‌ని ఆ ఉద్యోగి వాపోయాడు. అధిక స‌మ‌యం పనిచేయవద్దని కంపెనీ ఎప్పుడూ చెప్పలేదని ఎంప్లాయ్‌మెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. అతడి తరపు లాయర్ మీడియాతో మాట్లాడుతూ.... కంపెనీ భారీ టార్గెట్లు ఇవ్వ‌డం వ‌ల్లే ఆ ఉద్యోగి అధిక స‌మ‌యం ప‌నిచేశాడ‌ని, ఆయ‌నదేం త‌ప్పులేద‌ని అన్నారు.

More Telugu News