China: చైనా మరో ఎత్తుగడ.. ‘బ్రహ్మపుత్ర’ నీటిని తరలించేందుకు వెయ్యి కిలోమీటర్ల సొరంగం

  • ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం నిర్మాణానికి యోచన
  • పూర్తయితే భారత్, బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయం
  • కిలోమీటర్‌కు రూ.976 కోట్ల అంచనా వ్యయం

బ్రహ్మపుత్ర నదిపై మరో భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు డ్రాగన్ కంట్రీ చైనా సిద్ధమవుతోంది. బ్రహ్మపుత్ర నీటిని తరలించేందుకు వెయ్యి  కిలోమీటర్ల పొడవైన  సొరంగాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కరువుతో అల్లాడిపోతున్న జింజియాంగ్ ప్రాంతానికి ఈ నీటిని తరలించి సస్యశ్యామలంగా మార్చాలని భావిస్తోంది.

టిబెట్-జింజియాంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసిన చైనా ఇంజినీర్లు మార్చిలోనే ప్రభుత్వానికి అందించారు. అయితే ఖర్చుకు వెనకాడి అప్పట్లో దానిని అంతగా పట్టించుకోలేదు. అయితే ఇప్పటికప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించకున్నా భవిష్యత్తులో తప్పకుండా నిర్మించి తీరాలన్నది చైనా ప్రభుత్వ యోచన. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకుండా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాజెక్టును నిర్మించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

 చైనా కనుక ఈ ప్రాజెక్టు చేపడితే భారత్, బంగ్లాదేశ్‌లోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా రికార్డులకెక్కుతుంది. ఈ  ప్రాజెక్టు నిర్మాణం కోసం కిలోమీటర్‌కు రూ.976 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. 

More Telugu News