north korea: ఉత్త‌ర కొరియా నోరు మూయ‌గ‌ల శ‌క్తి ఒక్క చైనాకు మాత్ర‌మే ఉంది!: పిలిఫ్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్‌

  • త్వ‌ర‌లో ట్రంప్‌తో స‌మావేశం కానున్న రోడ్రిగో
  • ఉత్త‌ర కొరియా గురించి ట్రంప్‌కి న‌చ్చ‌జెప్పే అవ‌కాశం
  • గ‌తంలో ట్రంప్‌ను చాలా సార్లు విమ‌ర్శించిన డ్యూటెర్ట్‌

ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ చేస్తున్న అణుప‌రీక్ష‌ల‌కు క‌ళ్లెం వేసి, ఆ దేశం నోరు మూయించ‌గ‌ల స‌త్తా ఒక్క చైనా దేశానికి మాత్ర‌మే ఉందని పిలిఫ్పీన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యూటెర్ట్ అన్నాడు. `అణుయుద్ధానికి అంద‌రూ వ్య‌తిరేక‌మే.. అమెరికా, జపాన్ దేశాలు క‌లిసి త‌మ నుంచి ఉత్త‌ర కొరియాకు ఎలాంటి ముప్పులేద‌ని న‌చ్చ‌జెప్ప‌గ‌లిగితే అణుయుద్ధం అనే మాట ఉండ‌దు` అని డ్యూటెర్ట్ అన్నాడు.

త్వ‌ర‌లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను క‌ల‌వ‌నున్న డ్యూటెర్ట్‌... ట్రంప్‌ను సాద‌రంగా ఆహ్వానిస్తాన‌ని పేర్కొన్నాడు. ట్రంప్ చెప్పేది జాగ్ర‌త్త‌గా విన‌డంతో పాటు ఉగ్ర‌వాదం, మాద‌క ద్ర‌వ్యాల స‌మ‌స్య‌ల గురించి చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిపాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఉత్త‌ర కొరియా అంశాన్ని చ‌ర్చిస్తామ‌ని వెల్ల‌డించాడు. గ‌తంలో చాలా సార్లు ట్రంప్‌ను హేళ‌న చేసి మాట్లాడిన డ్యూటెర్ట్‌, ఆయనతో స‌మావేశంపై సానుకూల ధోర‌ణి ప్ర‌క‌టించ‌డంపై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏదేమైనా ప్ర‌పంచ దేశాల స‌మ‌స్య‌లు కొలిక్కిరావ‌డ‌మే ధ్యేయంగా ఇరు దేశాల అధ్య‌క్షులు చ‌ర్చించుకుంటే సంతోష‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News