supreem court: సుప్రీంకోర్టుకు నేడు బిగ్ 'బిగ్ డే'... ఆధార్ నుంచి లవ్ జీహాద్ వరకూ... క్రికెట్ నుంచి కాశ్మీర్ వరకూ.. పలు కేసుల విచారణ!

  • నేడు పలు కీలక కేసుల విచారణ
  • ఆధార్, లవ్ జీహాద్ కేసులు ముఖ్యమైనవి
  • మొబైల్, ఆధార్ అనుసంధానంపై కోర్టుకెక్కిన మమతా బెనర్జీ సర్కారు
  • జమ్ము కాశ్మీర్ ప్రత్యేక హక్కుల చట్టంపైనా వాదనలు

అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో నేడు పలు కీలక కేసులు విచారణకు రానున్నాయి. దేశ గతినిమార్చి, న్యాయ వ్యవస్థను, ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే కేసుల్లో నేడు న్యాయమూర్తులు వాదనలు విననున్నారు. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని బెంచ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున దాఖలైన ఆధార్ అనుసంధానంపై కేసును విననుంది. 12 అంకెల ఆధార్ సంఖ్యను ప్రతి సంక్షేమ పథకానికీ అనుసంధానం చేయడంపై ఆగ్రహంతో ఉన్న బెంగాల్ సీఎం ఈ కేసును దాఖలు చేశారు. క్లక్క్గే, మొబైల్ ఫోన్లకు ఆధార్ ను అనుసంధానం చేయడంపైనా ధర్మాసనం వాదనలు వింటుంది.

ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ ప్రివిలేజ్ లను కల్పించే రాజ్యాంగంలోని 35 (ఏ) ఆర్టికల్ పై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విననుంది. దేశంలోని మిగతా ప్రజలకు లేని హక్కులు, స్వతంత్ర హోదా కాశ్మీర్ కు అవసరం లేదని ఓ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలు జరగనున్నాయి.

ఈ కేసు తరువాత దీపక్ మిశ్రా బృందం కేరళ లవ్ జీహాద్ కేసునూ విచారించనుంది. ఓ ముస్లిం యువకుడు, హిందూ యువతిని వివాహమాడి, ఆమె మతాన్ని మార్పించిన కేసులో, హైకోర్టు విచారణ తీరును ప్రశ్నించిన మిశ్రా, తిరిగి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వీటితో పాటు బీసీసీఐలో సంస్కరణల అమలు జరుగుతున్న తీరుతెన్నులనూ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారించనుంది. ఇప్పటికే బీసీసీఐ అధికారులు ఓ ముసాయిదాను కోర్టుకు అందించగా, ధర్మాసనం దాన్ని పరిశీలించనుంది. ఇక పాఠశాలల్లో భద్రత, యునిటెక్ లిమిటెడ్ ప్రమోటర్, గృహాల కొనుగోలుదారులను మోసం చేశారన్న ఆరోపణలపై జైల్లో ఉన్న సంజయ్ చంద్ర బెయిల్ పిటిషన్ తదితర కేసులూ విచారణకు రానున్నాయి.

More Telugu News