kim: యుద్ధ సన్నాహాలు మొదలు... ఉత్తర కొరియా తీరాన్ని ఖాళీ చేయిస్తున్న కిమ్... రాత్రివేళల్లో కరెంట్ నిలిపివేత!

  • యుద్ధ సన్నాహకాలు ప్రారంభించిన కిమ్
  • ఆయుధాల తరలింపు మొదలు
  • గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న దక్షిణ కొరియా
  • కిమ్ చర్యలతో తీవ్ర అలజడి

ఏ క్షణమైనా అమెరికాతో యుద్ధం రావచ్చని భావిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సముద్ర తీర ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించే పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తున్నారు. ఇదే సమయంలో రాత్రి పూట శత్రువులకు టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతో రాత్రివేళల్లో కరెంట్ కట్ (బ్లాకౌట్) చేయించి, అంధకారంలో నగరాలను నిలుపుతున్నారు. యుద్ధ సన్నాహకాల్లో భాగంగా కసరత్తులు జరుగుతున్నాయని, ఏ ఆయుధాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించవచ్చో, ఆయా ప్రాంతాలకు ఆయుధాలను ఇప్పటికే తరలించారని ఉత్తర కొరియా వార్తా సంస్థ 'ఎన్కే న్యూస్' పేర్కొంది.

 ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా ఇటువంటి పనులు ఎన్నడూ చేయలేదని దక్షిణ కొరియా వ్యాఖ్యానించింది. అణ్వాయుధ భయాలను ఉత్తర కొరియా పెంచుతోందని దక్షిణ కొరియా సైన్యం మాజీ అధికారి చున్ ఇన్ భమ్ అభిప్రాయపడ్డారు. కాగా, తన అధినేతను గద్దె దించాలని అమెరికా ప్రయత్నిస్తోందని, అదే జరిగితే తాము అణుదాడికి దిగుతామని ఉత్తర కొరియా హెచ్చరిస్తుండటం గమనార్హం. ఏదిఏమైనా, కిమ్ తాజా చర్యలతో మరోసారి తీవ్ర అలజడి చెలరేగుతోంది.

More Telugu News