pro-Kabaddi: ముచ్చటగా మూడోసారి.. ప్రొ కబడ్డీ చాంపియన్‌గా పట్నా పైరేట్స్!

  • ప్రొ కబడ్డీ సీజన్-5 ట్రోఫీని ఎగరేసుకుపోయిన పట్నా పైరేట్స్
  • ప్రైజ్ మనీగా రూ.3 కోట్లు, పోరాడి ఓడిన గుజరాత్‌కు రూ.1.80 కోట్లు
  • అద్భుత ఆటతీరుతో జట్టును గెలిపించిన ప్రదీప్ నర్వాల్

రెండుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్ ముచ్చటగా  మూడోసారి కూడా పొ కబడ్డీ కప్‌ను ఎగరేసుకుపోయింది. శనివారం గుజరాత్ పార్చ్యూన్స్ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్‌లో 55-38తో ఘన విజయం సాధించి సీజన్-5 టైటిల్‌ను సొంతం చేసుకుంది. రైడింగ్, డిఫెన్స్ రంగాల్లో అదరగొట్టిన పైరేట్స్‌ గుజరాత్ జట్టును మట్టికరిపించింది. జట్టు సారథి ప్రదీప్ నర్వాల్ కీలక సమయంలో అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించిపెట్టాడు.

ఆరంభంలో 6-14తో వెనకబడిన వేళ నర్వాల్ జట్టును ఆదుకున్నాడు. తన రైడింగ్ మాయతో ప్రత్యర్థి జట్టును కోలుకోనివ్వకుండా చేశాడు. రైడింగ్, ట్యాకలింగ్‌లో రెచ్చిపోయిన పైరేట్స్ ఆ తర్వాత ఏ దశలోనూ గుజరాత్‌కు చాన్స్ ఇవ్వలేదు. నర్వాల్‌కు తోడు జైదీప్, విజయ్‌లు అద్భుత ట్యాకిలింగ్‌తో గుజరాత్ చిత్తు అయింది. చివరికి 55-38తో గుజరాత్‌పై ఘన విజయం సాధించింది. 2016 సీజన్‌లో జరిగిన రెండు టోర్నీల్లోనూ గెలిచిన పట్నా పైరేట్స్ ఈ గెలుపుతో హాట్రిక్ సాధించింది.

 కాగా, ఈ సీజన్‌లో అత్యధికంగా 369 రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా ప్రదీప్ నర్వాల్ రికార్డు సృష్టించాడు. అలాగే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘బెస్ట్ రైడర్’, ‘విలువైన ఆటగాడు’ అవార్డులను ప్రదీప్ అందుకున్నాడు. ప్రొ కబడ్డీ సీజన్-5 చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్ ప్రైజ్ మనీ కింద మూడు కోట్ల రూపాయలు అందుకోగా, పోరాడి ఓడిన గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ జట్టు రూ.1.80 కోట్లు అందుకుంది.

  • Loading...

More Telugu News