'chi: శ్రీ చైతన్యది నీచ సంస్కృతి... ప్రలోభపెట్టి విద్యార్థులను తీసుకుపోతుంటారు!: 'నారాయణ' జీఎం

  • ఆరోపణలు, ప్రత్యారోపణలతో రక్తికడుతున్న 'చైనా' కాలేజీల వివాదం
  • శ్రీచైతన్య కాలేజీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నారాయణ జీఎం
  • శ్రీచైతన్య మమ్మల్ని మోసం చేసింది
  • ప్రలోభపెట్టి విద్యార్థులను తీసుకుపోయి, పలు కాలేజీలను నిర్వీర్యం చేసింది

తెలుగు రాష్ట్రాల్లో 'చైనా' (శ్రీ చైతన్య, నారాయణ) కాలేజీల మధ్య వివాదం ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆసక్తి రేపుతోంది. నారాయణ కాలేజీ మోసాలకు నెలవు అంటూ శ్రీచైతన్య కాలేజీ బోర్డు డైరెక్టర్ సుష్మా చౌదరి ఆరోపణలు చేయడంపై నారాయణ కాలేజీ జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ, శ్రీచైతన్య కాలేజీది నీచ సంస్కృతి అన్నారు. శ్రీచైతన్య విద్యా సంస్థకు ఆది నుంచీ వేరే కళాశాలలో జాయిన్ అయ్యే విద్యార్థులను తమ వద్దకు తీసుకుపోవడం అలవాటని ఆరోపించారు. అలా గతంలో చాలా కాలేజీలను నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు.

తమను కూడా పలు మార్లు అలాగే మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయలేని శ్రీచైతన్య విద్యాసంస్థ ఇతర విద్యాసంస్థల్లోని విద్యార్థులను ప్రలోభపెట్టి తీసుకుపోయి, పబ్బం గడపుకుంటుందని ఆయన విమర్శించారు. ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రలోభపెట్టిన డీన్‌ ఎల్‌.రమేశ్‌, ఏజీఎం పార్ధసారథిపై విద్యార్థి పాజిల్‌ అహ్మద్‌ తల్లిదండ్రులు రియాజ్‌ అహ్మద్‌, ఆరీఫాలు వన్‌ టౌన్‌ లో ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. దీనిపై విచారణ జరుపుతుండగా శ్రీచైతన్య ఇలా ఎదురుదాడికి దిగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

More Telugu News