bhim singh: సినీఫక్కీలో రూ.5 కోట్లు దోచుకున్న గజదొంగ భీంసింగ్‌ను పోలీసులు అలా హతమార్చారు!

  • భీంసింగ్‌ను రాజస్థాన్‌లో హతమార్చిన కర్నూలు పోలీసులు
  • పక్కా స్కెచ్‌తో వెళ్లిన ఏపీ పోలీసులు 
  • పోలీసులపై భీంసింగ్ కాల్పులు.. ఎదురుకాల్పుల్లో హతం
కర్నూలు జిల్లా డోన్ హైవేపై గత నెలలో సినీఫక్కీలో రూ.5 కోట్లు దోచుకుని పరారైన భీంసింగ్‌ను కర్నూలు పోలీసులు రాజస్థాన్‌లో ఎన్‌కౌంటర్ చేశారు. 144 కేసుల్లో నిందితుడిగా ఉన్న భీంసింగ్‌ను పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అతడు కాల్పులు జరిపాడు. పోలీసులు ఎదురు కాల్పులకు దిగడంతో భీంసింగ్, డ్రైవర్ హతమయ్యారు.

హైదరాబాద్‌కు చెందిన నీలేశ్ మనీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారి. అరవింద్ కుమార్ సింగ్ అతడి వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కల్పద్రుమ జెమ్స్ అండ్ జ్యువెల్లరీకి చెందిన అక్షయ్ లునావత్ ఇచ్చిన రూ.5.5 కోట్లను నీలేశ్ 'నందలాల్ సీద్‌పుర' అనే మనీట్రాన్స్‌పోర్టు ఏజెన్సీకి అప్పగించేందుకు గత నెల 12న కారులో బయలుదేరాడు. డోన్ దాటిన తర్వాత ఓబులాపురం వద్ద నీలేశ్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు వారిని బెదిరించి అందులోని డబ్బును దోచుకున్నారు.  

 బాధితుల ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది గజదొంగ భీంసింగ్ పనేనని నిర్ధారించుకున్న పోలీసులు అప్పటి నుంచి అతని కోసం వేట ప్రారంభించారు. భీంసింగ్‌ను పట్టుకునేందుకు మాస్టర్ ప్లాన్ రచించారు. చివరికి అతడి కదలికలను రాజస్థాన్‌లోని జానూర్ జిల్లాలో గుర్తించిన పోలీసు బృందం అక్కడికి పయనమైంది. భీంసింగ్‌ తేరుకునేలోపే అతడిని చుట్టుముట్టిన పోలీసులు లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. అయితే అతడు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో భీంసింగ్ సహా అతడి వాహన డ్రైవర్ హతమయ్యారు.  
 
bhim singh
kurnool
police
encounter
rajasthan

More Telugu News