Americans: ఉత్తర కొరియాతో శాంతియుతమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం: అమెరికా రక్షణశాఖ మంత్రి

  • యుద్ధం చేయడం మా లక్ష్యం కాదు
  • సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించేందుకు మేము సిద్ధం
  • వ‌చ్చేనెల 7, 8వ తేదీల్లో ద‌క్షిణ కొరియాలో ట్రంప్ ప‌ర్య‌ట‌న

ఉత్తర కొరియా పాల్ప‌డుతోన్న దుందుడుకు చ‌ర్య‌లు ప్ర‌పంచ యుద్ధానికి దారి తీస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం అవుతోన్న విష‌యం తెలిసిందే. ఆ దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కునేందుకు అమెరికా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో అమెరికా రక్షణశాఖ మంత్రి జిమ్‌ మాట్టిస్‌ దక్షిణకొరియాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కేవ‌లం యుద్ధం చేయడం మాత్రమే తమ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు.

ఉత్తర కొరియాతో ఉన్న సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించేందుకు త‌మ దేశం సానుకూలంగానే ఉంద‌ని వ్యాఖ్యానించారు. తమకు యుద్ధమే లక్ష్యం కాదని గ‌తంలో త‌మ దేశ‌ విదేశాంగశాఖ మంత్రి టిల్లర్సన్ కూడా చెప్పార‌ని ఆయ‌న అన్నారు. తాము శాంతియుతమైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామ‌ని చెప్పారు. త‌మ దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వ‌చ్చేనెల 7, 8వ తేదీల్లో సియోల్‌లో పర్యటించి, ద‌క్షిణ కొరియాతో చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని వెల్లడించారు.

More Telugu News