kcr: కిలో రేషన్ బియ్యం బదులు రూ. 26.66... ఐదుగురుంటే నెలకు రూ. 800... రేషన్ షాపుల మూసివేతకు కేసీఆర్ నిర్ణయం!

  • బియ్యం తెచ్చుకుని అమ్ముకుంటున్న వాళ్లే అత్యధికం
  • రేషన్ పథకానికీ నగదు బదిలీ
  • అమలు చేయాలని గతంలోనే లేఖ రాసిన కేంద్రం
  • ఇప్పుడు కదిలిన కేసీఆర్ ప్రభుత్వం
  • సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న అధికారులు

చౌక ధరల దుకాణాల్లో బియ్యం తెచ్చుకున్నా, దోశలు, ఇడ్లీలు వేసుకునేందుకు తప్ప, తినడానికి అత్యధికులు మొగ్గు చూపబోరన్న సంగతి అందరికీ తెలిసిందే. రేషన్ షాపుల్లో బియ్యం తెచ్చుకుని, కిలో ఎనిమిదికో, పదికో అమ్ముకుంటున్న వాళ్లే అధికం. ఇక దేశవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాల్లో నగదు బదిలీ పథకం విస్తరిస్తున్న వేళ, రేషన్ లబ్దిదారులకూ ఇదే పథకాన్ని వర్తింపజేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ బదులు నగదు బదిలీ అనే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులను ఆయన కోరారు కూడా.

కేసీఆర్ సూచనల మేరకు అధికారులు రేషన్ లెక్క తేల్చారు. ప్రస్తుతం ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఐదుగురు వ్యక్తులున్న ఇంటికి నెలకు 30 కిలోల బియ్యం వెళుతుండగా, దాని బదులు కిలో బియ్యానికి రూ. 26.66 చొప్పున నెలకు రూ. 800 జమ చేయాలని అధికారులు తేల్చారు.

ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రానగర్ హవేలీల్లో ఇప్పటికే రేషన్ బియ్యం స్థానంలో నగదు బదిలీ అమలు చేస్తున్నారు. ఇదే పథకాన్ని అమలు చేయాలని కేంద్రం గతంలోనే తెలంగాణ సర్కారుకు లేఖ రాయగా, ఈ పథకం ఓటు బ్యాంకుతో ముడిపడి వుండటంతో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.

ఇక తమ కమిషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెల 1వ తేదీ నుంచి సమ్మెకు రేషన్ డీలర్లు పిలుపునిచ్చిన వేళ, కేసీఆర్ ఈ వినూత్న నిర్ణయం తీసుకుని సాధ్యమైనంత త్వరగా బియ్యం బదులు నగదు బదిలీ అమలు చేయాలని సూచించారు. రేషన్ షాపులను పూర్తిగా మూసేసి, వాటి ద్వారా ప్రజలకు అందే లబ్దిని బ్యాంకుల్లోకి మళ్లించడం ద్వారా అక్రమార్కులకు చెక్ పెట్టవచ్చన్నది కేసీఆర్ ఆలోచన.

  • Loading...

More Telugu News