Raqqa: భారత్‌కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. ఆందోళనలో ప్రభుత్వం.. విమానాశ్రయాల్లో నిఘా పెంపు

  • రక్కాలో పరాజయంతో సొంత దేశాలకు పయనమవుతున్న ఉగ్రవాదులు
  • హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు
  • తప్పుడు పాస్‌పోర్టులతో భారత్ వస్తున్న వారిపై నిఘా

సిరియాలోని రక్కాను రాజధానిగా చేసుకుని ప్రపంచ విధ్వంసానికి పూనుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను ఇటీవల ప్రభుత్వ దళాలు తరమికొట్టాయి. నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. దళాల ఎదురుదాడికి తాళలేని ఉగ్రవాదులు కొందరు పలాయనం చిత్తగించగా కొందరు లొంగిపోయారు. వందలాది మంది మరణించారు. ఉగ్రవాదుల చెర నుంచి రక్కాకు విముక్తి లభించినా ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఐసిస్ ఉగ్రవాదుల భయం  పట్టుకుంది.

రక్కానుంచి పారిపోయిన విదేశీ ఉగ్రవాదులు (ఎఫ్‌టీఎఫ్‌లు) వారి సొంత దేశాలకు పయనమవుతున్నట్టు సెక్యూరిటీ ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నారని కౌంటర్ టెర్రరిజం అధికారులు పేర్కొన్నారు. 2014కు ముందు వీరంతా ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇప్పుడు వారి సామ్రాజ్యం కూలిపోవడంతో వారంతా తిరిగి భారత్ వచ్చేందుకు పథక రచన చేస్తునట్టు పేర్కొన్నారు.

టర్కీ నుంచి భారత్‌కు వస్తున్న కేరళకు చెందిన ఐసిస్ అనుమానితులు అబ్దుల్ రజాక్, మిదిలాజ్, ఎంవీ రషీద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయాలు, సరిహద్దులలో నిఘా పెంచాలని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప్రభుత్వానికి  సూచించాయి. అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీ, యూఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని అనుమానిత భారతీయులపై దృష్టి పెట్టాలని సూచించాయి. తప్పుడు పాస్‌పోర్టులతో భారత్‌ రావాలనుకునే వారిపై నిఘా పెంచాలని ఆయా దేశాలకు సూచించాయి. ఇంటర్‌పోల్ సాయంతో 40 వేల మంది విదేశీ ఉగ్రవాదుల డేటా బేస్‌ను అధికారులు పరిశీలించనున్నారు.

More Telugu News