dean jones: ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌పై టీమిండియా అభిమానుల ఎదురుదాడి

  • జోన్స్‌పై విరుచుకుపడుతున్న భారత అభిమానులు
  • ఆసీస్ కంటే న్యూజిలాండే ఉత్తమ జట్టన్న నెటిజన్లు
  • సాక్ష్యం కావాలంటే మరోసారి భారత్ రావాలని పిలుపు

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు శతకం బాదడాన్ని ఎద్దేవా చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌పై భారత క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. కివీస్‌ను చూసి ఆసీస్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. కివీస్‌తో జరిగిన వన్డేలో కోహ్లీ 31వ సెంచరీ సాధించడం ద్వారా వన్డేల్లో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు నమోదు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. డీన్ జోన్స్ దీనిని ప్రస్తావిస్తూ ‘‘కోహ్లీ.. నువ్వు చాలా బాగా ఆడావు. కాకపోతే అది మళ్లీ న్యూజిలాండ్ అన్నది గుర్తుపెట్టుకో’ అని ఎగతాళి చేశాడు.

డీన్ జోన్స్ ట్వీట్‌తో ఒళ్లుమండిన భారత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిలాగే ఎగతాళి ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండే ఉత్తమ జట్టని ఒకరంటే, ఆ జట్టును చూసి ఆస్ట్రేలియా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇంకొకరు ట్వీటారు. వారు గెలిచారని, ఆసీస్ మాత్రం 4-1తో ఓడిందని గత సిరీస్‌ను గుర్తు చేశారు. సాక్ష్యం కావాలంటే మరోసారి ఇండియా రావాలంటూ గట్టిగా బదులిచ్చారు.

More Telugu News