Supreme court: థియేటర్‌లో ఇక నిలబడక్కర్లేదు.. దేశభక్తిని నిరూపించుకోనక్కర్లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

  • గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించేందుకు కోర్టు అంగీకారం
  • తప్పనిసరి స్థానంలో చేయొచ్చు.. అని మారుస్తామన్న ధర్మాసనం
  • దేశభక్తిని బలవంతంగా మోయాల్సిన అవసరం లేదని వ్యాఖ్య

సినిమా థియేటర్లలో జాతీయ గీతాలాపన సమయంలో తప్పనిసరిగా లేచి నిల్చోవాలంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సవరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇకపై థియేటర్లలో లేచి నిలబడి తమలోని దేశభక్తిని నిరూపించుకోవాల్సిన పనిలేదని కీలక తీర్పు చెప్పింది. జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడాలనడం దేశ భక్తికి సూచన కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఫ్లాగ్ కోడ్ నిబంధనలను సవరించాలని కేంద్రానికి సూచించింది.

శ్యాం నారాయణ్ చౌక్సీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సమాజానికి మోరల్ పోలీసింగ్ అవసరం లేదని పేర్కొంది. ఇకపై సినిమాలకు టీషర్టులు, షార్టులు ధరించి రాకూడదని, అలా వస్తే జాతీయ గీతాన్ని అవమాన పరచడమే అవుతుందని ప్రభుత్వం అంటుందని కోర్టు ఆక్షేపించింది. తమ భుజాలపై తుపాకి పెట్టి కాల్చడాన్ని తాము అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది. గత డిసెంబరులో తాము ఇచ్చిన ఉత్తర్వుల్లోని ‘తప్పనిసరి’ పదాన్ని ‘చేయొచ్చు’ అని మార్చేందుకు సిద్ధమని కోర్టు పేర్కొంది. తమ భుజాలపై దేశభక్తిని మోయాలంటూ పౌరులను బలవంతం చేయబోమని స్పష్టం చేసింది.

కాగా, గతేడాది డిసెంబరు 1న జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే ఈ ఉత్తర్వులు ఇచ్చింది. థియేటర్లలో జాతీయ గీతాలాపన సమయంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లేచి నిల్చోవాలని అందులో పేర్కొంది. దేశభక్తిని, జాతీయ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశమని అప్పట్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News