dog: అనుకోని అతిథి... అధికారిక సమావేశానికి వ‌చ్చిన అధ్యక్షుడి పెంపుడు కుక్క‌!

  • స‌మావేశం జ‌రుగుతుండ‌గా మూత్రం పోసిన కుక్క‌
  • అయినా చ‌ర్చ‌లు కొన‌సాగించిన‌ ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యుయేల్‌
  • కుక్క‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ వ్యాఖ్య‌

ఫ్రాన్స్ అధ్య‌క్ష నివాస‌ భ‌వ‌నం ఎలీసీ ప్యాలెస్‌లో జ‌రిగిన ఓ ముఖ్య‌స‌మావేశానికి అధ్య‌క్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ పెంపుడు కుక్క పిల‌వ‌ని అతిధిగా హాజ‌రైంది. మంత్రులు, ప్ర‌భుత్వాధికారులు హాజ‌రైన ఆ స‌మావేశంలో మాక్రోన్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే పెంపుడు కుక్క `నీమో` నానా అల్ల‌రి చేసింది. స‌మావేశ గ‌దిలో అటూ ఇటూ తిర‌గడం, విచిత్రంగా అర‌వ‌డం, మూత్రం పోయ‌డం వంటి ప‌నులు చేసింది.

దాని చేష్ట‌లు చూసిన మంత్రి ఒక‌రు అధ్య‌క్షుడిని కుక్క ప్ర‌వ‌ర్త‌న గురించి ఆరా తీశారు. దానికి ఎమ్మాన్యుయేల్ త‌న కుక్క‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని, అది ఎప్పుడూ ఇలా చేయ‌లేద‌ని సంజాయిషీ ఇచ్చారు. అంతేకాకుండా నీమోను బ‌య‌టికి కూడా పంప‌లేదు. అది ఓ ప‌క్క హాల్ మొత్తం క‌లియ‌దిరుగుతుండ‌గా, మ‌రో ప‌క్క ఎమ్మాన్యుయేల్ స‌మావేశాన్ని కొన‌సాగించారు.

నీమోను ఆగస్ట్‌లో మాక్రోన్‌ దంపతులు ఓ రెస్క్యూ సెంటర్‌ నుంచి దత్తత తీసుకున్నారు. ‘నీమో’ రెండేళ్ల లాబ్రెడార్‌-గ్రిఫ్రిన్‌ జాతికి చెందిన శునకం. అప్పటి నుంచి మాక్రోన్‌ ఎక్కడికి వెళ్లినా ‘నీమో’ ఆయన వెంటే ఉంటుంది. మీడియా కూడా ‘నీమో’ ఫొటోలు తరచూ తీస్తుంటుంది. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సార్కోజీకి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆయన పదవిలో ఉన్నప్పుడు వారి పెంపుడు కుక్కలు ప్యాలెస్‌లో కొన్ని వేల యూరోల విలువ చేసే ఫర్నీచర్‌ను ధ్వంసం చేశాయి.

More Telugu News