sunkara kalyan: జనసేన అధికార ప్రతినిధి సుంకర కల్యాణ్ అరెస్ట్ వెనుక అసలు కారణమిది!

  • వారంటీ ముగిసిన ఫోన్ ను అమ్మిన కల్యాణ్
  • అడిగితే బెదిరింపులు
  • అరెస్ట్ చేసిన పోలీసులు, నిన్నటి నుంచి రిమాండ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చెందిన విషయాలను మీడియాకు చేరవేసే అధికార ప్రతినిధిగా పనిచేస్తూ, హైదరాబాద్ లో సీసీ కెమెరాల వ్యాపారం చేస్తున్న సుంకర కల్యాణ్ దిలీప్ అరెస్ట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ తరువాత పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కండిషన్ లో లేని, వారంటీ ముగిసిన ఫోన్ ను కల్యాణ్ విక్రయించడం గొడవకు ప్రధాన కారణం.

సెకండ్ హ్యాండ్ వస్తువుల ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ ఓఎల్ఎక్స్ లో తన ఐఫోన్ ను కల్యాణ్ అమ్మకానికి పెట్టగా, సైఫాబాద్ ప్రాంతానికి చెందిన మిథున్ చక్రవర్తి దాన్ని రూ. 34 వేలకు కొనుగోలు చేశాడు. ఆపై వారిద్దరి మధ్యా జరిగిన గొడవ కల్యాణ్ లోని మరోకోణాన్ని వెలుగులోకి తెచ్చి అరెస్ట్ కు దారి తీసింది.

ఫోన్ ను కొనుగోలు చేసిన చక్రవర్తి, ఇంటికి వెళ్లి చూసుకోగా, అది బాగాలేదు. వారంటీ కూడా ముగిసింది. దీంతో ఆ ఫోన్ తనకు వద్దని చెబుతూ, పలుమార్లు డబ్బు తిరిగి ఇవ్వాలని కల్యాణ్ ను కోరాడు. ఈ క్రమంలో 21వ తేదీన రాత్రి పదింటికి పద్మారావు నగర్ లోని బాలాజీ డాబా వద్దకు రావాలని మిథున్ ను కల్యాణ్ కోరాడు. అక్కడికి మిథున్ వెళ్లగా, మరోసారి వాగ్వాదం జరిగింది. తన వద్ద ఫిస్టల్ ఉందని బెదిరిస్తూ, కారులో ఉన్న డమ్మీ ఫిస్టల్ ను తీసి మరోసారి డబ్బులు అడిగితే హత్య చేస్తానని బెదిరించాడు.

ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న నార్త్ జోన్ పోలీసులు కల్యాణ్ ను అరెస్ట్ చేశారు. ఆయన్నుంచి 'ఏపీ 09 సీజీ 2818' నంబర్ కారు, డమ్మీ పిస్టల్, ఆరు బులెట్లు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.

More Telugu News