vijay: బీజేపీ వ్యతిరేకిస్తున్న 'మెర్సెల్' డైలాగిదే... జీఎస్టీపై విజయ్ నోటి వెంట...!

  • జీఎస్టీపై చిత్రంలో డైలాగులు
  • పన్ను వసూలు చేస్తూ ఉచితవైద్యం ఇవ్వలేరా?
  • ఈ మందులపై పన్ను వేసి, ఆ 'మందు'ను వదిలేస్తారా?
  • తొలగిస్తామని చెప్పిన నిర్మాతలు

విజయ్ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'మెర్సెల్' (తెలుగులో అదిరింది)లో బీజేపీ ప్రభుత్వ కీలక ఆర్థిక సంస్కరణ వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని బీజేపీ నేతలు గగ్గోలు పెడుతుండగా, వాటిని తొలగించేందుకు సినీ నిర్మాతలు అంగీకరించిన సంగతి తెలిసిందే. అసలు ఈ చిత్రంలో జీఎస్టీకి వ్యతిరేకంగా అంత పెద్ద డైలాగులు ఉన్నాయా? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రజలకు ఆరోగ్య విషయమై భద్రత కోసం ఆ డైలాగులు రాశామే తప్ప, కేంద్ర విధానాన్ని తప్పుబట్టే ఉద్దేశాలు తమకు లేవని నిర్మాత రామినేని ప్రకటించారు.

ఇక ఈ చిత్రంలో హీరో విజయ్ నోటి వెంట, "7 శాతం జీఎస్టీ వసూలు చేసే సింగపూర్‌ లో ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. కానీ, ఇక్కడ 28 శాతం జీఎస్టీ వసూలు చేసే మన ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? పైగా మందులపై 12 శాతం జీఎస్టీ విధించిన ఈ ప్రభుత్వం.. మన ఆడపడుచుల కాపురాలు కూల్చే 'మందు'పై మాత్రం జీఎస్టీ విధించలేదు" అని వినిపిస్తుంది. అదే ఇప్పుడు బీజేపీ ఆగ్రహానికి కారణమైంది. ఇక తాజా నిరసనలతో సదరు డైలాగ్ తీసేస్తామని నిర్మాత చెప్పడంతో వివాదం సద్దుమణిగినట్టేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

More Telugu News