cyrus mistry: నా టైం అయిపోయింది... కాసేపట్లో పంపించేస్తారు!: నాడు భార్యకు టెక్ట్స్ మెసేజ్ పెట్టిన సైరస్ మిస్త్రీ!

  • గౌరవంగా తొలగించే మార్గమున్నా పాటించలేదు
  • గత సంవత్సరం అక్టోబర్ ఘటనను గుర్తు చేసుకున్న నిర్మాల్య కుమార్
  • మిస్త్రీ టీమ్ లో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్న నిర్మాల్య

అక్టోబర్ 24, 2016... టాటా సన్స్ చైర్మన్ గా మార్చి 2017 వరకూ బాధ్యతలు నిర్వహించాల్సిన సైరస్ మిస్త్రీని తొలగించాలని నిర్ణయించుకున్న బోర్డు, ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న రోజు. అప్పట్లో జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని మిస్త్రీ టీమ్ లో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న నిర్మాల్య కుమార్ తన బ్లాగులో తాజాగా వెల్లడించారు. అదే రోజు మిస్త్రీతో పాటు ఉద్వాసనకు గురైన నిర్మాల్య కుమార్, తన పోస్టులో మిస్త్రీని అన్యాయంగా, ఘోరంగా తొలగించారని, కాస్తంత గౌరవంగా తొలగించే మార్గమున్నా, దాన్ని పాటించలేదని ఆరోపించారు.

ఇక ఆనాడు బోర్డు సమావేశం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉండగా, మిస్త్రీకి అప్పటికే విషయం తెలిసిపోయిందని, తనను బయటకు పంపడం ఖాయమని, ఈ విషయంలో తాను చేసేది ఏమీ లేదని తెలుసుకున్న ఆయన, విషయాన్ని తన భార్యకు టెక్ట్స్ మెజేజ్ రూపంలో తెలిపారని అన్నారు. తన సమయం ముగిసిందని, కాసేపట్లో బయటకు పంపించనున్నారని ఆయన తన భార్యకు మెసేజ్ ద్వారా చెప్పినట్టు వెల్లడించారు. 148 సంవత్సరాల టాటా గ్రూప్ చరిత్రలో కేవలం ఆరుగురు చైర్మన్లు మాత్రమే ఉన్నారని, ఎవరినీ మిస్త్రీలా తొలగించలేదని ఆయన గుర్తు చేశారు. దాదాపు సంవత్సరం పాటు ఎంతో జాగ్రత్తగా స్క్రూటినీ చేసి ఎంపిక చేసుకున్న మిస్త్రీని, ఎంపిక చేసుకున్నంత సమయం కూడా విధుల్లో ఎందుకు ఉండనివ్వలేదని ఆయన ప్రశ్నించారు.

More Telugu News