hyderabad: హైదరాబాదులో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు.. భయాందోళనలకు గురైన ప్రజలు!

  • ఆదివారం తెల్లవారుఝామున ప్రకంపనలు
  • వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు
  • 24 గంటల వ్యవధిలో పలుమార్లు ప్రకంపనలు

నిన్న మధ్యాహ్నం స్వల్ప భూ ప్రకంపనల తరువాత, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మరిన్ని ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ తెల్లవారుఝామున పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఇళ్లల్లో నిద్రిస్తున్న వారు తీవ్ర భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. తమ ఇళ్లలోని వస్తువులు కదిలాయని, గోడలు బీటలు వారాయని పలువురు పేర్కొన్నారు. రాత్రి 4 గంటల సమయంలో ఈ కంపనలు నమోదైనట్టు తెలుస్తోంది.

బోరబండ, రెహమత్ నగర్, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ తదితర ప్రాంతాల్లో అపార్టుమెంట్లలో నివసిస్తున్న వారు ఈ ప్రకంపనలను స్పష్టంగా గమనించారు. ఇవే ప్రాంతాల్లో శనివారం కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపు నాలుగైదు గంటల పాటు తాము ఇళ్లల్లోకి ప్రవేశించకుండా భయంతో వీధుల్లో ఉండిపోయామని ఇక్కడి వారు వాపోయారు.

కాగా, రిక్టర్ స్కేలుపై ఈ ప్రకంపనలు 2 నుంచి 3 లోపే నమోదయ్యాయని, వీటివల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం ఉండదని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

More Telugu News