fire crakers: దీపావళి వెలుగులు: సాయంత్రం 6 తరువాత ఢమఢమలాడించిన ఢిల్లీ వాసులు!

  • నిషేధాజ్ఞలు పట్టించుకోని ఢిల్లీ ప్రజలు
  • అర్ధరాత్రి 3 గంటల వరకూ టపాకాయల చప్పుళ్లు
  • 10 రెట్లు పెరిగిన కాలుష్యం
  • గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం తక్కువే

ఢిల్లీలో దీపావళి పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సాహాల నడుమ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరం టపాకాయల విక్రయాలను సుప్రీంకోర్టు నిషేధించినప్పటికీ, ప్రజలు ఎంతమాత్రమూ తగ్గలేదని తెలుస్తోంది. అయితే, గత సంవత్సరం కాలుష్య గణాంకాలతో పోలిస్తే, ఈ సంవత్సరం ప్రాథమిక అంచనాలను బట్టి కాలుష్యం కొంతమేరకు తగ్గింది. నేషనల్ కాపిటల్ రీజియన్ లో బహిరంగంగా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు కనిపించనప్పటికీ, అనధికారికంగా టపాకాయలు వీధివీధినా పుష్కలంగా లభించాయి. ఆన్ లైన్ అమ్మకాల్లో జోరు కనిపించింది.

ఇక, పలు సంస్థలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ గణాంకాల ప్రకారం, గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ఘనపు మీటర్ వాతావరణంలో పీఎం 2.5పై 878 మైక్రోగ్రాములు, పీఎం 10పై 1,179 మైక్రోగ్రాముల కాలుష్య పరమాణువులు ఉన్నట్టు నమోదైంది. సాధారణంగా ఇవి 60, 100 మైక్రోగ్రాములుగా ఉండాలి. సాధారణ రక్షిత స్థాయితో పోలిస్తే, 10 రెట్ల వరకూ వాతావరణం కలుషితం కాగా, గత సంవత్సరంతో పోలిస్తే ఇది సగం కాలుష్యమేనని తెలుస్తోంది.

కాగా, సాయంత్రం 6 గంటల వరకూ తమకు పెద్దగా టపాకాయల శబ్దాలు వినిపించలేదని, ఆ తరువాత మాత్రం సాధారణ దీపావళి మాదిరే కనిపించిందని, చిన్నా, పెద్దా తేడాలేకుండా పటాసులు కాలుస్తూ ఆనందించారని పలువురు తెలిపారు. రాత్రి 11 గంటల తరువాత టపాకాయలు కాల్చవద్దన్న ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదని, తెల్లవారుఝామున 3 గంటల వరకూ పటాసుల శబ్దాలు వింటూనే ఉన్నామని పలువురు తెలిపారు.

ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో సైతం వాయు నాణ్యత కనిష్ఠస్థాయికి పడిపోయినట్టు తెలుస్తోంది. కాగా, వందలాది మంది దీపావళి టపాకాయల కోసం 140 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి, హర్యానాలోని కర్నాల్, యూపీ పరిధిలోకి వచ్చే నోయిడా తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుని మరీ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది.

More Telugu News