dalailama: ఉగ్రవాదుల్లో ముస్లిం, క్రైస్తవ, హిందూ అంటూ ఉండరు...!: దలైలామా

  • ఉగ్రవాదానికి మతం లేదు
  • ఏ మతం వారైనా ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంది
  • ట్రంప్ నినాదం సరికాదు

ఉగ్రవాదులకు ప్రత్యేకంగా మతం ఉండదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. ఇంఫాల్ లో జరిగిన ఒక రిసెప్షన్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులకు ముస్లిం, క్రైస్తవ, హిందూ అన్న మతాలు ఉండవని అన్నారు. వారికి ఉన్నదల్లా ఉన్మాదమేనని, హతమార్చాలన్న కోరికేనని ఆయన చెప్పారు. చంపాలనుకుంటే వారు ఎవరినైనా చంపేస్తారని ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని కొనసాగించడమే వారి అభిమతమని ఆయన తెలిపారు. హింసాత్మక ప్రవృత్తి ఉన్నవారు ఏ మతానికి చెందినవారైనా ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

అమెరికానే తన తొలి ప్రాధాన్యం అనే ట్రంప్‌ నినాదం సరికాదని ఆయన స్పష్టం చేశారు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని ఆయన తెలిపారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మనం సృష్టించుకున్నదేనని ఆయన స్పష్టం చేశారు. దాదాపు వెయ్యేళ్ల అహింసా చరిత్రను కలిగిన భారతదేశం ప్రపంచంలో శాంతిని స్థాపించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు తమ భావోద్వేగాలను తమ నియంత్రణలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. కోపం ప్రజల రోగ నిరోధక శక్తిని హరిస్తుందని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని ఆయన తెలిపారు. 

More Telugu News