america: అమెరికాకు కుళ్లు అందుకే అలా ఆరోపణలు చేస్తోంది: ఉత్తరకొరియా

  • రానున్న ఐదేళ్లలో ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నాము
  • తమ అంతరిక్ష ప్రయోగాలకు అమెరికా వక్రభాష్యం చెబుతోంది
  •  న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ కోసం ఉపగ్రహ పరీక్షలు చేయడం లేదు

ఉత్తరకొరియా అభివృద్ధిని చూసి అమెరికా కుళ్లుకుంటోందని ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా రాయబారి కిమ్ రోయాంగ్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, రానున్న ఐదేళ్లలో తమ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రచించారని అన్నారు. తాము జరపబోతున్న అంతరిక్ష ప్రయోగాలకు అమెరికా వక్రభాష్యం చెబుతోందని ఆయన ఆరోపించారు.

ఉత్తరకొరియా ఆర్థికంగా బలపడేందుకు తమ అధ్యక్షుడు వినూత్న కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తుంటే అమెరికా సహించలేకపోతోందని విమర్శించారు. అమెరికా ఆరోపణల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు కూడా తమ దేశాన్ని అనుమానంగా చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాల కోసమే అంతరిక్షంలోకి ఉపగ్రహలను పంపనుందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

అయితే అమెరికా ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము చిత్తశుద్ధితో తమ దేశ ఆర్థికాభివృద్ధి కోసమే పని చేస్తున్నామని, న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాల కోసం ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు.  

More Telugu News