jr artist: సాఫ్ట్ వేర్ ఉద్యోగికి బైక్ ను అమ్మేసి, మళ్లీ దొంగలించిన జూనియర్ ఆర్టిస్టు!

  • సినిమాల్లో అవకాశాల కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొన్న వాసుదేవరావు
  • ఆర్థిక ఇబ్బందులతో మరో జూనియర్ ఆర్టిస్టు ప్రవీణ్ దగ్గర తాకట్టు
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లక్ష్మీ భార్గవ్ కు బైక్ ను అమ్మేసి, మళ్లీ ఆ బైక్ ను దొంగిలించిన ప్రవీణ్

ఓ బైక్ ను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు విక్రయించి, మళ్లీ ఆ బైక్ ను తనే దొంగిలించి సినిమా తెలివితేటలు ప్రదర్శించిన జూనియర్ ఆర్టిస్టును పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొంత స్టైల్ గా, మరికొంత పొష్ గా కనిపించాల్సి ఉంటుందని భావించిన జూనియర్ ఆర్టిస్ట్ గుండా వాసుదేవరావు రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను కొనుక్కున్నాడు. అయితే ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో మరో జూనియర్ ఆర్టిస్టు ప్రవీణ్ వద్ద దానిని లక్ష రూపాయలకు కుదువపెట్టాడు. ఆ సందర్భంగా సకాలంలో డబ్బులు చెల్లించకపోతే ఆ బైక్ ను విక్రయించి సొమ్ముచేసుకోవచ్చని నోటు కూడా రాసిచ్చాడు.

నిర్ణీత సమయంలో డబ్బు కట్టడంలో వాసుదేవరావు విఫలం కావడంతో బైక్ ను ప్రవీణ్, లక్ష్మీ భార్గవ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అమ్మేశాడు. వారం రోజుల తరువాత పత్రాలు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో బైక్ ను తీసుకెళ్లిన లక్ష్మీ భార్గవ్ పత్రాల కోసం జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 5లోని ప్రవీణ్ వద్దకు వెళ్లాడు. ప్రవీణ్ ఇంటి బయట బైక్ ను పార్క్ చేసిన లక్ష్మీ భార్గవ్ లోపలికెళ్లాడు.

దీనిని ఆసరాగా చేసుకున్న ప్రవీణ్, డూప్లికేట్ తాళంతో ఆ బైక్ ను దొంగిలించాడు. దీంతో బయటకు వచ్చి చూసిన లక్ష్మీ భార్గవ్ కు వాహనం కనిపించకపోవడంతో జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం బైక్ పై దర్జాగా తిరుగుతున్న ప్రవీణ్ ను అరెస్టు చేసి, బైక్ ను రికవరీ చేసుకుని, లక్ష్మీ భార్గవ్ కు అప్పగించి, ప్రవీణ్ ను రిమాండ్ కు తరలించారు. 

More Telugu News