Chandrababu: జన్మభూమి రుణం తీర్చుకోండి.. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయండి.. ప్రవాసాంధ్రులతో చంద్రబాబు

  • ప్రారంభమైన చంద్రబాబు అమెరికా పర్యటన
  • షికాగోలో ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు
  • వరుస సమావేశాలతో బిజీబిజీ
  • రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని పిలుపు

అమెరికా పర్యటనలో భాగంగా షికాగో చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి  అక్కడి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్లోబల్ తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్ నెట్‌వర్క్ (జీ-టెన్) సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఐటీ  సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు.

 ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జాబ్ ఉంది కదా అని సరిపెట్టుకోవద్దని, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రలో వచ్చే 12 నెలల్లో 500 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమన్నారు. విజయవాడలో ఐటీ సంస్థల ఏర్పాటుకు 60 ఎన్నారై కంపెనీల ప్రతినిధులు ముందుకు వచ్చారు.

షికాగోలో తెలుగు ఐటీ నిపుణులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. షికాగోలో మిమ్మల్ని చూస్తుంటే తాను హైదరాబాద్‌లో ఉన్నానా, లేక విజయవాడలో ఉన్నానా? అన్న సందేహం కలుగుతోందన్నారు.

20 ఏళ్ల క్రితం తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. ఐటీలో మనవాళ్ల హవా కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ఇక అమెరికాలో ఎక్కడ చూసినా ఏపీ నుంచి వచ్చిన చేపలు లభిస్తాయన్నారు.  

జన్మభూమి రుణం తీర్చుకునేందుకు పుట్టిన గడ్డకు ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని, ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా మరింతమందికి ఉద్యోగాలిచ్చి సంపద సృష్టించాలని చంద్రబాబు కోరారు. అలాగే మిమ్మల్ని ఆదరించి, ఆతిథ్యం ఇస్తున్న అమెరికాను కూడా మర్చిపోవద్దన్నారు.

అనంతరం అక్కడి నుంచి తన బృందంతో కలిసి చంద్రబాబు డిమోయిన్స్ చేరుకుని వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఐయోవా గవర్నర్ చంద్రబాబుకు విందు ఇచ్చారు. తానా ప్రతినిధులు చంద్రబాబును కలిసి అమరావతిలో 20 లక్షల డాలర్లతో తానా భవన్  నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరారు.

More Telugu News