fake baba: భూత వైద్యం పేరిట బూతు వైద్యం.. నకిలీ బాబాకు అరదండాలు!

  • హర్యానా నుంచి విరాళాల కోసం వచ్చిన మన్నన్ బాబా
  • హుమయూన్ నగర్ లో భూతవైద్యుడి పేరుతో మకాం
  • అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులు
  • మహిళ ఫిర్యాదుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు

హైదరాబాదులో మరో బాబా ముసుగు తొలగింది. భూత వైద్యం పేరుతో బూతు వైద్యం చేస్తున్న బాబాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హర్యానా నుంచి విరాళాల సేకరణ పేరిట హైదరాబాదు వచ్చిన మన్నన్ బాబా, మదర్సాను నిర్వహించాడు. అనంతరం భూతవైద్యం పేరిట హుమయూన్ నగర్ లో మకాం వేశాడు. అమాయక ముస్లిం మహిళలను గుర్తించి, వారికి సమస్యలు ఉన్నాయని బెంబేలెత్తించేవాడు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి, వారిని వలలో వేసుకునే వాడు.

అతనిని నమ్మి అందుకు సిద్ధమైన వారి శరీరంపై సాతాను వాలిందని వారిని భయపెట్టేవాడు. అనంతరం వైద్యం, శాంతి, పరిహారం పేరిట వారిని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో మగపిల్లాడి కోసం ఆశపడ్డ ఓ మహిళకు పక్కింటి వారు అతని గురించి చెప్పగా, ఆమె అతనిని ఆశ్రయించింది. దీంతో వలకు చిక్కిన లేడిపిల్లలా ఆమెను అన్ని రకాలుగా వేధించాడు. అతని వేధింపులకు తాళలేకపోయిన ఆమె డీసీపీ వెంకటేశ్వరరావును ఆశ్రయించింది. దీంతో పోలీసులు, అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఆమె నుంచి 4 లక్షల రూపాయలను నకిలీబాబా దోచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. 

More Telugu News