rajashan: రాజ్ నాథ్ సింగ్ కు అవమానం... గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేందుకు రాని రాజస్థాన్ పోలీసులు!

  • మూకుమ్మడిగా సెలవు పెట్టిన కానిస్టేబుళ్లు
  • 250 మంది విధులకు డుమ్మా
  • వేతనాలు తగ్గనున్నాయన్న భయంతోనే
  • చర్యలు తీసుకుంటామన్న అధికారులు

బీజేపీ పాలన నడుస్తున్న రాజస్థాన్ లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు అవమానం జరిగింది. జోధ్ పూర్ పర్యటనకు ఆయన వచ్చిన వేళ, సైనిక వందనం లభించలేదు. ఇటీవల వసుంధరా రాజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా తమ వేతనాలు తగ్గుతున్నాయని ఆరోపించిన పోలీసు కానిస్టేబుళ్లు మూకుమ్మడిగా సెలవు పెట్టి రాజ్ నాథ్ కు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చేందుకు రాలేదు. దాదాపు 250 మంది కానిస్టేబుళ్లు సెలవు పెట్టారు.

ఈ ఘటనపై జోధ్ పూర్ పోలీసు కమిషనర్ అశోక్ రాథోడ్ స్పందిస్తూ, వీరెవరికీ లీవులు ఇవ్వలేదని అన్నారు. లీవు పెట్టిన వారిలో కొందరు రాజ్ నాథ్ కు గౌరవ వందనం సమర్పించే విధుల్లో ఉన్నారని, వారిని హెచ్చరించినా రాలేదని తెలిపారు. విధులకు డుమ్మా కొట్టినందున వీరికి నోటీసులు పంపి, శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నామని అన్నారు. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని రాజస్థాన్ డీజీపీ అజిత్ సింగ్ వెల్లడించారు.

కాగా, ప్రస్తుతం కానిస్టేబుల్ పే స్కేలు రూ. 24 వేలుగా ఉండగా, దాన్ని రూ. 19 వేలకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని వాట్స్ యాప్ గ్రూపుల్లో వైరల్ అయిన పోస్టు వల్లే కానిస్టేబుళ్లు విధులకు గైర్హాజరై తమ ఆందోళనను, భయాన్ని కేంద్రానికి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News