narendra modi: జీఎస్టీపై మాట మార్చిన నరేంద్ర మోదీ!

  • జీఎస్టీ తమ ఘనతే అంటూ ఇంతకాలం గొప్పగా చెప్పుకున్న మోదీ
  • ఇందులో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉందంటూ ఇప్పుడు మాట మార్చిన ప్రధాని
  • కాంగ్రెస్ పార్టీది కూడా సమానమైన పాత్రేనన్న మోదీ

జీఎస్టీ గురించి ఇంతకాలం గొప్పగా చెప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు మాట మార్చారు. జీఎస్టీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదని చెప్పారు. ఒక్క పార్లమెంటే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని తెలిపారు. జీఎస్టీ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానిది చిన్ని పాత్ర మాత్రమేనని అన్నారు. గుజరాత్ గౌరవ మహా సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

జీఎస్టీ కౌన్సిల్ లో దాదాపు 30 పార్టీలు ఉన్నాయని... జీఎస్టీని అమలు చేయాలనే నిర్ణయానికి సంబంధించి ఈ పార్టీలన్నీ భాగస్వాములేనని మోదీ చెప్పారు. ఇందులో కాంగ్రెస్ పార్టీది కూడా సమానమైన పాత్ర ఉందని అన్నారు. ఇప్పటికైనా జీఎస్టీపై అబద్ధాలను ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పారు. జీఎస్టీ అమలు తర్వాత తాను వ్యాపారులతో మాట్లాడానని... వారంతా సంతోషంగానే ఉన్నారని తెలిపారు.

More Telugu News