BJP: ఎన్నికల ముందు గుజరాత్ రైతులకు బంపరాఫర్ ప్రకటించిన ముఖ్యమంత్రి

  • నిజమైన విపక్షాల ఆరోపణ
  • రూ.మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం
  • రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు లబ్ధి
  • ప్రభుత్వంపై ఏటా రూ.700 కోట్ల భారం

విపక్షాలు ఆరోపించినదే నిజమైంది. ఎన్నికలకు ముందు గుజరాత్ ప్రభుత్వం రైతులపై వరాల జల్లు కురిపించింది. గ్రామీణ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రైతులకు సున్న వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

15 రోజులుగా నిర్వహిస్తున్న ‘గుజరాత్ గౌరవ్ యాత్ర’ సోమవారం భట్‌లో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రూపానీ మాట్లాడుతూ.. రైతులకు రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. దీనివల్ల 25 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. రైతులకిచ్చే రుణంలో 7 శాతం వడ్డీని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయన్నారు. రుణాల అమలు వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.700 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.
 
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు 16 శాతం వడ్డీ చెల్లించినట్టు చెప్పారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక దానిని ఒక శాతం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు విజయ్ రూపానీ దానిని వడ్డీ లేని రుణంగా మార్చారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్‌ను ఆయన డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ పాలిత పంజాబ్ విషయాన్ని ప్రస్తావించవద్దని, అక్కడి గత అకాలీదళ్ ప్రభుత్వమే ఆ పనిచేసిందని షా పేర్కొన్నారు.

కాగా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల నగారా మోగించిన ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి గుజరాత్ షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. ఎలక్షన్ కమిషన్ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి. గుజరాత్ ప్రజలకు తాయిలాలు ప్రకటించిన తర్వాతే షెడ్యూల్ ప్రకటించాలంటూ ఈసీపై కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చిందని ఆరోపించాయి. ఇప్పుడు రైతులపై రుణాల జల్లు కురిపించడం అందులో భాగమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

More Telugu News