Delhi: అత్యాచారాల విషయంలో ప్రపంచంలోనే ముందున్న ఢిల్లీ.. తాజా సర్వే వెల్లడి!

  • మహా నగరాలపై సర్వే నిర్వహించిన థామ్సన్‌ రాయిటర్స్‌ సంస్థ
  •  ప్రపంచంలోని 19 మహానగరాల్లో సర్వే
  • మహిళలపై లైంగిక దాడుల్లో నెం.1 ఢిల్లీ
  • లండన్‌ అత్యంత సురక్షిత నగరం

దేశరాజధాని ఢిల్లీ రేపిస్టు సిటీగా అప్రదిష్టను మూటగట్టుకుంది. నిర్భయ ఘటన జరిగిన తర్వాత ఈ నగరం మహిళలపై అత్యాచారాలకు నెలవుగా మారింది. గుర్గావ్ పారిశ్రామిక ప్రాంతంలో తరచుగా జరుగుతున్న రేప్ ఘటనలు ఆందోళన పరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలపై లైంగిక దాడులు జరిగే అవకాశమున్న ప్రమాదకర నగరాలతో పాటు అత్యంత సురక్షిత నగరాలపై లండన్ కు చెందిన థామ్సన్ రాయిటర్స్ సంస్థ... ప్రపంచంలోని 19 మహానగరాల్లో సర్వే నిర్వహించింది.

 ఈ జూన్‌-జులై నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఒక్కో నగరం నుంచి 20 మంది చొప్పున మొత్తంగా 380 మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఫలితాలను తాజాగా వెల్లడించింది. ఈ సర్వేలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్న నగరాల జాబితాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ, రేప్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌ గా రికార్డులకెక్కింది.

దీంతో దేశరాజధాని పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిసింది. ఢిల్లీలోని మహిళలు నిత్యం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు, చిత్రహింసలు వంటి భయాలతో వణికిపోతుంటారని ఆ సర్వే వెల్లడించింది. కాగా, ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరంగా లండన్ స్థానాన్ని దక్కించుకుంది. 

More Telugu News