cricket: 'ఓ మేఘమా, ఉరమకే ఈ పూటకి...' అంటున్న క్రికెట్ ప్రియులు!

  • సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న చివరి టీ20
  • గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా ప్లాన్ 
  • మ్యాచ్ గెలిచి విమర్శకుల నోళ్లు మూయించాలని ఆసీస్ ప్రయత్నం 

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో పేటియం టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ నేటి సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉండగా, టీ20తో ఫాంలోకి వచ్చాం, సిరీస్ గెలిచే తీరతాం అని ఆస్ట్రేలియా అంటోంది. మరోవైపు మీ రెండు జట్లపై నాదే పైచేయి అంటోంది వాతావరణం!

 గత వారం రోజులుగా వరుణుడు హైదరాబాదులో ఇబ్బడిముబ్బడిగా వర్షాలు కురిపించి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మరో నాలుగు రోజులపాటు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాదు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. దీంతో అభిమానులు...'ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి..' అంటూ వేడుకుంటున్నారు.

ఇక ఉప్పల్ పిచ్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ డేవిడ్ వార్నర్, మోసెస్ హెన్రిక్స్ కు మంచి పట్టు ఉంది. వీరిద్దరూ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే జట్టులో భువనేశ్వర్ కుమార్ స్టార్ బౌలర్. ఈ నేపథ్యంలో వీరికి ఈ పిచ్ ఎలా స్పందిస్తుంది, ఇక్కడ ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? వంటి అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుందని క్రీడాభిమానులు అంచనా వేస్తున్నారు.

చివరి టీ20కి ఇప్పటికే టికెట్లు అమ్ముడైపోయాయి. నేటి సాయంత్రం నాలుగు గంటల నుంచి వీక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. గువహటి ఘటన నేపథ్యంలో పోలీసులు స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసరాల్లో 56 సీసీ కెమెరాలు అమర్చారు. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

More Telugu News