masaba: నా పదేళ్ల వయసు నుంచీ ఈ తిట్లు భరిస్తున్నాను..!: వివ్ రిచర్డ్స్-నీనా గుప్తాల కూతురు

  • సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు తెలుపుతూ నెటిజన్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన మసాబా గుప్తా
  • విమర్శలు, తిట్లతో ట్రోల్ చేసిన నెటిజన్లు
  • తిట్టిన వారందరికీ సమాధానం చెబుతూ పోస్టు పెట్టిన మసాబా 
  • ఇండో-కరీబియన్ అయినందుకు గర్వపడుతున్నా 

సుప్రీంకోర్టు తీర్పుకు మద్దతు పలికిన సెలబ్రిటీకి సోషల్ మీడియాలో దారుణమైన దూషణలు ఎదురయ్యాయి. అయితే ఆమె దీటుగా వాటిని తిప్పికొట్టి ధీరత్వం ప్రదర్శించి ఆకట్టుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... వాతావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో భాగంగా సుప్రీంకోర్టు దీపావళికి బాణసంచాను నిషేధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఒక నెటిజన్ చేసిన ట్వీట్ ను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, వెస్ట్‌ ఇండీస్‌ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌, నటి నీనా గుప్తాల కుమార్తె మసాబా గుప్తా రీట్వీట్‌ చేసింది. అంతే.. ఆమెపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. హిందూ ధర్మం గురించి నీకేం తెలుసు? అని ప్రశ్నిస్తూ, అక్రమ సంతానం అంటూ దూషణలు మొదలు పెట్టారు.

దీంతో వారందరికీ ఆమె సమాధానం చెబుతూ...‘నన్ను బాస్టర్డ్‌ చైల్డ్‌, అక్రమంగా భారతదేశంలో ఉంటున్న వెస్ట్‌ ఇండియన్‌ మహిళ అంటూ తిడుతున్నారు. మీరీ మాటలంటున్నప్పుడు నా హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. నేను ఇద్దరు ప్రముఖులకు (వివ్‌రిచర్డ్స్‌, నీనా గుప్తా) పుట్టాను. అంతేకాదు, నాకు నచ్చినట్టుగా, కష్టపడి నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మలుచుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను.

నా పదేళ్ల వయసు నుంచీ నన్నిలాగే తిడుతున్నారు. నా ధర్మం.. నేను చేసే పని, సమాజానికి నేను అందించే సేవల్లోనే ఉంటుంది. కనుక మీరు ఎంత ప్రయత్నించినా నాపై వేలెత్తి చూపే అవకాశం ఉండదు. కాబట్టి నన్ను ఇలాంటి పదాలతో మీరు దూషిస్తే అవి నన్ను మరింత గర్వపడేలా చేస్తాయి. ఇంకో విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలి, అదేంటంటే, నేను ఇండో-కరీబియన్‌ యువతినైనందుకు గర్వపడుతున్నాను’ అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు, మద్దతు లభిస్తోంది. 

More Telugu News