An Insignificant Man: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సినిమా.. ప్రపంచవ్యాప్తంగా విడుదల!

  • ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్‘ విడుదలకు సర్వం సిద్ధం
  • మెమిసిస్ ల్యాబ్‌తో అమెరికా మీడియా కంపెనీ వైస్ ఒప్పందం
  • నవంబరు 17న విడుదల

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు అమెరికాకు చెందిన మీడియా కంపెనీ ‘వైస్’ సిద్ధమైంది.

కుష్బూ రంక, వినయ్ శుక్లా కలసి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓ నాన్-ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్. కేజ్రీవాల్ ఓ సామాజిక కార్యకర్త నుంచి రాజకీయ వేత్తగా ఎదిగిన వైనాన్ని ఇందులో చూపించారు.

ఈ సినిమాను ఓ ‘మాస్టర్ పీస్’గా అభివర్ణించిన వైస్.. నిర్మాత ఆనంద్ గాంధీకి చెందిన మెమిసిస్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించింది.

‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మ్యాన్’ సినిమాను తను 2016లో టొరొంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో తొలిసారి చూశానని వైస్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జాసన్ మొజికా తెలిపారు. మార్షల్ కర్రీ ‘స్ట్రీట్ ఫైట్’ తర్వాత ఇదే అత్యద్భుతమైన చిత్రమని మొజికా పేర్కొన్నారు.

ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో నిర్మాతలకు, అప్పటి సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లానికి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. సినిమాకు నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలంటే మోదీని కలవాలని నిహ్లానీ పేర్కొనడం కలకలం రేపింది. చివరికి ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రైబ్యునల్ జోక్యంతో విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఇప్పుడీ సినిమాను 22 దేశాలతోపాటు టీవీల్లోనూ ప్రదర్శించనున్నారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి ఓ రాజకీయ పార్టీ వెనక ఏం జరుగుతుందన్నది ఉన్నది ఉన్నట్టుగా చూపించామని ఆనంద్ గాంధీ మెమిసిస్ ల్యాబ్ పేర్కొంది. నవంబరు 17న భారత్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

More Telugu News