mammootty: వీరాభిమానితో మ‌మ్ముట్టి... రోడ్డు మీద ఆగి క్షేమ‌స‌మాచారాలు అడిగిన హీరో!

  • ఫొటో దిగి, షేక్ హ్యాండ్ ఇచ్చిన మ‌ల‌యాళ న‌టుడు
  • వైర‌ల్ అవుతున్న వీడియో
  • హీరోల‌కు ఆద‌ర్శం అంటున్న నెటిజ‌న్లు

బాల‌న్‌ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ప్రాంతానికి చెందిన ఆదివాసి. మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి అంటే అత‌నికి ప్రాణం. త‌న త‌దుప‌రి చిత్రం `అంకుల్‌` షూటింగ్ కోసం మ‌మ్ముట్టి వ‌య‌నాడ్ వ‌చ్చాడు. ఆ విష‌యం తెలుసుకున్న బాల‌న్ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. ఎలాగైనా త‌న అభిమాన న‌టుడిని క‌ల‌వాల‌ని ఆరాట‌ప‌డ్డాడు. అందుకే మ‌మ్ముట్టి వ‌స్తున్న దారిలో కాపు కాచాడు. అప్పుడే ఆ దారిలో వ‌స్తున్న బెంజ్ కారుకు ఎదురుగా వెళ్లి ఆపాడు. వెన‌క సీటులో కూర్చున్న‌ ఒక అమ్మాయి కారు అద్దం తీసి ఏం కావాల‌ని ప్ర‌శ్నించింది. `ఇందులో మ‌మ్ముట్టి సార్ ఉన్నాడా?` అని అడిగాడు. `ఆ... ఉన్నాడు. ఎందుకు?` అని ఆమె అడిగింది. `నేను ఆయ‌న మ‌నిషిని` అని బాల‌న్ స‌మాధాన‌మిచ్చాడు.

వెంట‌నే ముందు సీటు నుంచి `ఇలా...రా!` అని ఓ గొంతు వినిపించింది. ముందు సీటులో వ్య‌క్తి అద్దం తీయ‌గానే బాల‌న్ నిశ్చేష్టుడ‌య్యాడు. ఒక్క క్ష‌ణం బాల‌న్‌కి నోట‌మాట రాలేదు. ఆ ముందు సీట్లో కూర్చుంది స్వ‌యంగా మ‌మ్ముట్టి. అత‌న్ని చూడ‌గానే బాల‌న్ సంతోషంతో పొంగిపోయాడు. మ‌మ్ముట్టి అత‌న్ని ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు. క్షేమ‌స‌మాచారాలు అడిగి తెలుసుకున్నాడు. ఒక సెల్ఫీ కూడా దిగాడు. బాల‌న్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ వీడియో కూడా తీయించుకున్నాడు. ఇదంతా ప‌క్క‌నే ఉన్న డ్రైవ‌ర్ సింటో తొట్టిపుల్లి వీడియో తీశాడు. ఆ వీడియోను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా హీరోలంద‌రికీ మ‌మ్ముట్టి ఆద‌ర్శ‌మ‌ని పొగిడేస్తున్నారు.

More Telugu News