హాలీవుడ్ హీరోని క్షమాపణలు చెప్పేలా చేసిన యువతి!

12-10-2017 Thu 13:52
  • హాలీవుడ్ లో కలకలం రేపుతున్న నిర్మాత హార్వే వెయిన్ స్టన్ వేధింపుల వ్యవహారం
  • వెయిన్ స్టన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బెన్ అఫ్లెక్
  • నువ్వా నీతులు చెప్పేది.. పదేళ్ల క్రితం ఏం చేశావు? అంటూ బెన్ అఫ్లెక్ ను నిలదీసిన యువతి
  • దీంతో జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పిన బెన్ అఫ్లెక్
90లలో హాలీవుడ్ అగ్రనటుల్లో ఒకడిగా పేరుతెచ్చుకున్న బెన్‌ అఫ్లెక్‌ (45) ను ఓ నెటిజన్ క్షమాపణలు చెప్పేలా చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్ దిగ్గజ నిర్మాత హార్వే వెయిన్‌ స్టన్‌ పై స్టార్ హీరోయిన్లు ఏంజెలినా జోలీ, గ్వెనెత్ పాల్ త్రూ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో హాలీవుడ్ లోని పలువురు నటులు స్పందిస్తూ, వెయిన్ స్టన్ పై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో బెన్ అఫ్లేక్ కూడా అతనిపై మండిపడ్డాడు. ట్విట్టర్ లో వెయిన్ స్టన్ పై మండిపడుతూ, ఈయన తనకు వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తి అని పేర్కొంటూ, అతని ఎదుగుదలలో భాగమయ్యానని అన్నాడు. అలాంటి వారి నుంచి మహిళలు, కుటుంబ సభ్యులు, స్నేహితురాళ్లు, సహోద్యోగినులు, కుమార్తెలను కాపాడుకోవాల్సి ఉంటుందని సూచించాడు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చాడు. ఈయనపై మీడియాలో వచ్చిన వార్తాకథనాలు చూసి తీవ్రఆగ్రహం కలిగిందని అన్నాడు.

కాగా, 1997లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'గుడ్ విల్ హంటింగ్' సినిమాకు నిర్మాతగా వెయిన్ స్టన్ వ్యవహరించగా, బెన్ అఫ్లెక్ అందులో ప్రధానపాత్ర పోషించాడు. దీనిపై ఒక నెటిజన్ తీవ్రంగా స్పందించింది. 'నువ్వా? నీతులు మాట్లాడుతున్నావు? పదేళ్ల క్రితం నువ్వు చేసిందేమిటి?' అంటూ నిలదీసింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఎంటీవీ ప్రముఖ మ్యూజిక్ ఛానెల్ గా ఉన్న రోజుల్లో 'టోటల్ రిక్వెస్ట్' అన్న కార్యక్రమం ప్రసారమయ్యేది. దీనికి యాంకర్ గా హిల్లరీ బర్టన్ వ్యవహరించేది.

ఒకరోజు కార్యక్రమంలో పాల్గొన్న బెన్ అఫ్లేక్ మాట్లాడుతూనే ఆమె ఎదపై చెయ్యివేసి, అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై పలు సందర్భాల్లో బర్టన్ మండిపడింది. అయినప్పటికీ బెన్ మాత్రం దానిపై ఎప్పుడూ స్పందించలేదు. నెటిజన్ నేరుగా నిలదీసేసరికి ఇన్నేళ్ల తరువాత...'తాను చేసింది తప్పేనని, మనస్పూర్తిగా ఆమెను క్షమాపణలు కోరుతున్నా'నని అన్నాడు. దీనిపై బర్టన్ స్పందించింది. తన తరపున ప్రశ్నించినందుకు ఆ నెటిజన్ కు ధన్యవాదాలు తెలిపింది. అప్పటి వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.